
మహిళలకు అండగా ‘శుక్రవారం సభ’
కరీంనగర్: శుక్రవారం సభ వేదికగా మహిళలకు అన్ని రకాలసాయం, సమాచారం ఇస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. శుక్రవారం సభ ద్వారా మహిళల హక్కులు, చట్టాలలను అధికారులు తెలియజేస్తారని అన్నారు. ప్రతినెలా బీపీ, షుగర్ మాత్రలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40రకాల పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ చిన్నారులకు డ్రాయింగ్ బుక్స్, పలకలు అందజేశారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీఎంహెచ్‌వో సుధా, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, సీడీపీవో సబిత పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాలున్న పిల్లలను భవిత కేంద్రాలకు పంపాలి
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను జిల్లాలో ఉన్న వివిధ భవిత కేంద్రాలకు పంపించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ముకరంపురలోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు ఉన్న 38మంది పిల్లల తల్లిదండ్రులకు టీఎల్‌ఎం కిట్లను పంపిణీ చేశారు. అలీం కో సంస్థ ద్వారా గతంలో ప్రత్యేక అవసరాలు ఉన్న భవిత కేంద్రంలోని విద్యార్థుల కోసం క్యాంపు నిర్వహించామని తెలిపారు. 38మంది విద్యార్థులకు మెటీరియల్ అందించామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,485 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉండగా కొంతమందిని మాత్రమే భవిత కేంద్రాలకు పంపిస్తున్నారని, మిగితావారిని కూడా పంపించాలని కోరారు. వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. డీఈవో మొండయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, అశోక్‌రెడ్డి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, జిల్లా సైన్స్ అధికారి జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి