
అసలేంటి ఈ అబార్షన్ కిట్లు
అబార్షన్ కిట్లను అబార్టిఫేసియంట్ డ్రగ్స్‌గా పిలుస్తారు. మెఫిప్రిస్టోన్, మీసోప్రోస్టాల్ తదితర టాబ్లెట్లు ఈ కిట్‌లో ఉంటాయి. వీటిని అవాంఛిత గర్భస్రావాలకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌షాపులపై డీసీఏ దాడులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా హుజూరాబాద్, జమ్మికుంట, సుల్తానాబాద్, సిరిసిల్ల, జగిత్యాల షాపులపై డీసీఏ దాడులు చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో ఓ మెడికల్ షాపును ఏకంగా మూసివేశారు. జగిత్యాల జిల్లాలో ఐదు షాపులు, పెద్దపల్లి జిల్లాలో మరో ఆరుషాపులకు అబార్షన్ కిట్లు విక్రయిస్తున్నందుకు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం.. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలో జమ్మికుంట, హుజూరాబాద్‌లో స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధరణ పరీక్షలు చేయడం, అబార్షన్ కిట్లు వాడి గర్భంలోనే చిదిమేయడం అలవాటుగా మారింది. వాస్తవానికి వైద్యుల సమక్షంలో ఆసుపత్రుల్లోనే ఈ ప్రక్రియ జరగాలి. కానీ, వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎవరికి వారు, ఆసుపత్రుల బయట ఈ తతంగాన్ని నడపడం ఆందోళనకరంగా మారింది.