
ఇందిరమ్మకు ఇసుక కష్టాలు
● ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల అవస్థలు ● పేరుకే ఉచితం.. రవాణాతో భారం ● ఇల్లు కట్టలేం బాబోయ్ అంటున్న లబ్ధిదారులు
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఇసుక కష్టాలు తప్పడం లేదు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని’ చందంగా ఉంది జిల్లాలో ఇసుక లభ్యమవుతున్న తీరు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితమని ప్రభుత్వ ప్రకటన బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ట్రాక్టర్ యజమానులు లబ్ధిదారులను పిండేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందు ట్రిప్పుకు రూ.2,500 నుంచి రూ.3,200 వరకు ఉండగా ప్రభుత్వ ప్రకటన అనంతరం రెట్టింపుస్థాయిలో ధర పలుకుతోంది. ప్రస్తుతం ఇసుకను ట్రిప్పుకు రూ.4,000కు సరఫరా చేస్తుండగా సన్నపు ఇసుకకు రూ.5వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇసుక ఉచితమే కదా అని ప్రశ్నిస్తే రవాణా భారమంటూ మాటల గారడీ చేస్తున్నారు వ్యాపారులు. మొన్నటి వరకు ఇంటి నిర్మాణం నిర్దేశించిన కొలతలను మించవద్దని ఆంక్షలు విధించారు. అది సమసిపోయిందనుకొనేలోగా ఉచిత ఇసుక ఇస్తామని ప్రకటించి, రవాణా ఖర్చులు లబ్ధిదారులే భరించాలనడంతో ఆర్థికభారం తప్పడం లేదు.
ఉచితం కన్నా ఆన్‌లైన్‌లోనే చవక
ఇందిరమ్మ ఇంటి నిర్మాణదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించేందుకు సిద్ధమైంది. ఒక ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు 25 క్యూబిక్ మీటర్ల (12 ట్రాక్టర్లు) ఇసుక అవసరమని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్లే బేస్‌మెంట్ వరకు 3, స్లాబ్ లేవలు 3, స్లాబ్‌కు ప్లాస్టింగ్ కలిపి ఆరు ట్రాక్టర్ల కేటాయించాలని నిర్ణయించారు. ఇందుకు గ్రామ కార్యదర్శి, పురపాలక కమిషనర్ జారీ చేసిన అనుమతి పత్రం తహసీల్దారుకు సమర్పిస్తే దగ్గరలో ఉన్నవాగులో ఉచితంగా ఇసుక తీసుకోవడానికి టోకెన్లు ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా ట్రాక్టర్ అద్దె, లేబర్ కూలీ చూసి కంగుతినడం లబ్ధిదారుడి వంతవుతోంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేస్తే రూ.3,750కు ఇంటివద్ద పోస్తారు. అదే ఉచిత ఇసుక మొత్తం రవాణాకు రూ.4500లకు దాటిపోతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన నిర్మాణాలు
మొదటి విడత జిల్లాలో 2,027 ఇళ్లు కేటాయిస్తే 200మందికి పైగా రద్దు చేసుకున్నారు. 1,200 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక రెండో విడత జిల్లాలో మొత్తం 8,219 మంజూరు కాగా 5,089 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందచేశారు. 742 మంది మాత్రమే పనులు ప్రారంభించగా ఇంకా మిగిలిన వారికి మంజూరుపత్రాలు ఇవ్వాల్సి ఉంది. మంజూరు పత్రాలు అందుకున్న వారు ఇంటి నిర్మాణం మొదలు పెట్టినా ఉచిత ఇసుక భారం మోయలేకపోతున్నారు.
ఇసుక గురించి ఆలోచిస్తేనే భయమేస్తోంది
ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న సంతోషం లేదు. ఇసుకను తలచుకుంటేనే భయమేస్తోంది. రెట్టింపు ధరలతో దోచుకుంటున్నా అధికారులు నియంత్రించడం లేదు. నిర్మాణానికి పునాది గుంతలు తీసి ఇసుక కోసం ఎదురు చూస్తున్నాం. ఉచిత ఇసుక తీసుకు రావడానికి ట్రాక్టరుకు రూ.4,500కు పైగా ఖర్చవుతోంది.
– సంజీవరెడ్డి, హుజూరాబాద్

ఇందిరమ్మకు ఇసుక కష్టాలు