
ఆపరేషన్ ఫుట్‌పాత్
● ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణపై బల్దియా స్పెషల్ డ్రైవ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర సమస్యంగా మారిన ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణలపై సుదీర్ఘకాలం తర్వాత నగరపాలకసంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసుల సహకారంతో నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి చేస్తున్న వ్యాపారాల తొలగింపు చురుగ్గా సాగుతోంది.
ఫుట్‌పాత్‌లపైనే వ్యాపారాలు
నగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో అంతే వేగంగా వ్యాపారాలు పెరుగుతున్నాయి. అయితే రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడం ప్రధాన సమస్యగా మారింది. స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మించిన విశాలమైన ఫుట్‌పాత్‌లు వ్యాపారాల కోసం నిర్మించినట్లుగా మారాయి. కొంతమంది నేరుగా ఫుట్‌పాత్‌లపైనే వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మరికొందరు తమ దుకాణాల ముందున్న ఫుట్‌పాత్‌లు, రోడ్లపై సామగ్రి ఉంచి వ్యాపారం చేస్తున్నారు. రద్దీ అధికంగా ఉండే టవర్‌సర్కిల్, రాజీవ్‌చౌక్, శాసీ్త్రరోడ్, మార్కెట్‌ఏరియాలతో పాటు నగరంలోని హైదరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల వైపు వెళ్లే ప్రధాన రహదారులపై ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణ వ్యాపారాలు ఎక్కువగా సాగుతున్నాయి. దీంతో తరచూ ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
కొనసాగిస్తేనే మేలు
నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలపై బల్దియా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రత్యేక చొరవ తీసుకొని స్వయంగా డ్రైవ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లపై వ్యాపారాలను డీఆర్‌ఎఫ్ సిబ్బందితో తొలగింపచేస్తున్నారు. అయితే బల్దియా సిబ్బంది తొలగించిన కొద్దిరోజులకు పరిస్థితి షరామామూలుగా మారుతోంది. తిరిగి ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారా లు మొదలు పెడుతున్నారు. దుకాణదారులు సైతం కొన్నిరోజులు తమ షట్టర్లకే పరిమితమైనట్లు కని పించినా, తర్వాత మెల్లిగా ఫుట్‌పాత్‌లు, రోడ్లపైకి సామగ్రిని చేరుస్తున్నారు. కొంతమంది దుకాణ దారులు ఫుట్‌పాత్‌పై రెయిలింగ్, ర్యాంప్‌లు లాంటి శాశ్వత నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. కాగా ఆక్రమణల తొలగింపు కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ను పూర్తి చేసిన అనంతరం కూడా కొనసాగిస్తేనే బల్దియా అధికారుల లక్ష్యం నెరవేరుతుంది.
తొలగింపు నిరంతర ప్రక్రియ : కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియ అని నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. సోమవారం టౌన్‌ప్లానింగ్, ట్రాఫిక్‌పోలీసులతో కలిసి నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి పద్మనగర్ వరకు సిరిసిల్ల రహదారిపై ఉన్న ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాదచారులు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. రోజూ ఒక రోడ్డులో డ్రైవ్ చేపట్టి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దుకాణదారులు తమ షాప్‌ల పరిధిలోనే వ్యాపారాలు నిర్వహించుకోవాలని, ఫుట్‌పాత్‌లు, రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, టీపీఎస్‌లు రాజ్‌కుమార్, తేజస్విని, సంధ్య, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.