
సీసీ కెమెరాలతో జరిమానాలు పెరిగాయ్
● సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, సీసీ కెమెరాలతో జరిమానాలు విధించినప్పటి నుంచి ఉల్లంఘన కేసులు పెరుగుతున్నాయని సీపీ గౌస్ ఆలం అన్నారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని గురువారం పరిశీలించిన సీపీ మాట్లాడుతూ గత నెల 27నుంచి సీసీ కెమెరాల ద్వారా చలాన్లు ప్రారంభించగా.. ఇప్పటి వరకు 13,869 కేసుల్లో రూ.1,13,43,400 జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. ఇందులో ట్రిఫుల్ రైడింగ్ , సీల్ట్‌బెల్ట్ లేకుండా, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్ అంశాల్లో జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, ఓవర్‌స్పీడ్‌కు జరిమానా విధించడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, సీఐలు కరీముల్లాఖాన్, రమేశ్ పాల్గొన్నారు.