
ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి
కరీంనగర్: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వీ శ్రీకాంత్, పొడపంగి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, విద్యా సంవత్సరం ప్రారంభమైనా అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించకుండా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నెలకొల్పుతామని ఆర్భాటంగా ప్రకటించి, ప్రభుత్వ బడుల విధ్వంసానికి పాల్పడుతుందని మండిపడ్డారు. ఇప్పటికీ జిల్లాలో అనేక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, తక్షణమే వాటికి సొంత భవనాలు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించి భర్తీ చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణాప్రతాప్, ఉపాధ్యక్షుడు కేంసారం రవితేజ, సహాయ కార్యదర్శి అరవింద్, నాయకులు అస్లాం, రాకేశ్, అజయ్, బాబు, శ్రీనివాస్, నవీన్, సాయికుమార్, అయాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులపై వివక్ష
కరీంనగర్: కరీంనగర్ అర్బన్ ఎంఈవోగా భద్రయ్యను కొనసాగించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు కిషన్‌నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఫిలింభవన్‌లో జిల్లా అధ్యక్షుడు మీసాల మల్లిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ అర్బన్ ఇన్‌చార్జి ఎంఈవోగా కొనసాగుతున్న భద్రయ్యను విద్యాశాఖాధికారులు తప్పుదోవ పట్టించడం వల్ల అకారణంగా ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించడం జరిగిందన్నారు. గతంలో కూడా పోతన శ్రీనివాస్ అనే దళిత ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేసి సుదూర ప్రాంతానికి బదిలీ చేయడం జరిగిందన్నారు. విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఒక పథకం ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులపై వివక్ష కొనసాగుతున్నట్లు అవగతం అవుతుందన్నారు. జిల్లా విద్యాశాఖలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ అరికట్టాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు శంకర్, బలరాం, శివకుమార్, రంగయ్య, రమేశ్, బానోతు శంకర్, కుమారస్వామి, రాజన్న, గిరి, సురేశ్, శ్రీనివాస్, తిరుపతి, సమ్మయ్య పాల్గొన్నారు.
బెల్టుషాపులను మూసివేయాలి
కరీంనగర్: చట్ట వ్యతిరేక బెల్టుషాపులను వెంటనే మూసివేయాలని సర్వాయి పాపన్న గీత పారిశ్రామిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పర్శరాంగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది గీతకార్మికులు గీతవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారి పాట్టగొడుతూ కొందరు దురాశపరులు ప్రమాదకర రసాయనాలతో కల్తీ కల్లు తయారు చేసి, అదే చెట్టుమీది కల్లు అని అబద్ధాలు చెప్పి సొమ్ము జేసుకుంటున్నారని పేర్కొన్నారు.కల్తీ కల్లు వ్యాపారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చెట్టుపై నుంచి పడి చనిపోయినవారికి, వికలాంగులుగా మారినవారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామనే ప్రకటనలే తప్ప నిధులు విడుదల చేయడం లేదన్నారు. కల్తీ కల్లును అరికట్టాలని, కానీ, కల్తీకల్లు పేరుతో పల్లెల్లోని గీతకార్మికులను వేధించవద్దన్నారు. పలు సమస్యలపై త్వరలో కలెక్టరేట్‌ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మల్లేశం, రాజమల్లు, పర్శరాం, రాంశంకర్‌గౌడ్, నర్స య్య, ఆంజనేయులు, పర్శరాములు, అయిలయ్య, రాజయ్య, ఐలన్న, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి