
సీఎం సారూ మాకేది రుణమాఫీ
మల్లాపూర్(కోరుట్ల): ‘అయ్యా సీఎం సారు.. మాకేది రుణమాఫీ.. కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం పాపం చేశాం..’ అంటూ రుణమాఫీ కాని రైతులు తమ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో బుధవారం జరిగింది. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ, రుణమాఫీ పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. ఒక్క మొగిలిపేటలోనే 276మంది రైతులకు మాఫీ వర్తించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ గోడును ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వీరికి మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు సంఘీభావం ప్రకటించారు. రుణమాఫీ కాని రైతులు పార్టీలకతీతంగా ఉద్యమించేందుకు ముందుకు రావాలన్నారు. మూడునెలల క్రితం రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి ప్రజావాణిలో అర్జీలు సమర్పించామని, అయినా రైతులకు న్యాయం జరగకపోవడం శోచనీయమన్నారు. ప్యాక్స్ వైస్ చైర్మన్ దూలురి సుధాకర్‌రెడ్డి, నాయకులు దండవేని వెంకట్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.