Karimnagar Cable Bridge Will Be Inaugurated On April 14 - Sakshi
Sakshi News home page

Karimnagar: తీగల వంతెనకు ముహూర్తం ఖరారు.. ఆరోజే ఓపెనింగ్‌!

Published Mon, Mar 20 2023 12:40 AM

- - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ సిగలో మరో మణిహారంగా నిలిచే తీగల వంతెన ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వచ్చేనెల 14న వంతెన ప్రారంభించాలని ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా వంతెనను ప్రారంభిస్తారని సమాచారం. వాస్తవానికి తీగల వంతెనను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభింపజేయాలని అంతా అనుకున్నారు. కానీ.. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మాణం, సెక్రటేరియట్‌ పనుల కారణంగా ఆయన పర్యటన సాధ్యపడలేదని తెలిసింది. అందుకే మంత్రి గంగుల కమలాకర్‌ విజ్ఞప్తి మేరకు వంతెన ప్రారంభానికి స్వయంగా కేటీఆర్‌ రానున్నారని సమాచారం.

వేగంగా డైనమిక్‌.. అప్రోచ్‌ రోడ్డు పనులు
వరంగల్‌– కరీంనగర్‌ నగరాల మధ్య దాదాపు 7 కిలోమీటర్ల దూరం తగ్గించడం, హైదరాబాద్‌– కరీంనగర్‌ రహదారి మీద ట్రాఫిక్‌ జామ్‌ బెడద నివారణకు ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి పూనుకుంది. 2018లో రూ.180 కోట్ల బడ్జెట్‌తో వంతెన పనులు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని తీగల వంతెన తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కేబుల్‌ బ్రిడ్జి ఇదే కావడం విశేషం. పూర్తిగా విదేశీ ఇంజినీరింగ్‌ సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి నాణ్యతను ఇప్పటికే పలుమార్లు ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించారు. వచ్చేనెల 14న ప్రారంభ తేదీ ఖరారు కావడంతో ఇప్పటికే రూ.8కోట్లతో ఏర్పాటు చేస్తున్న డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పనులు, సదాశివపల్లి నుంచి తీగలవంతెన వరకు, ఇటువైపు హౌజింగ్‌ బోర్డు వైపు కమాన్‌ వెళ్లే మార్గాన్ని కలిపే అప్రోచ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల కోసం సామగ్రిని తరలించేందుకు జనవరి 26 నుంచి తీగల వంతెనపైకి వాహనాలను కూడా అనుమతించారు.

ప్రతి ఆదివారం సెలవు..!
ఏప్రిల్‌ 14న ప్రారంభించిన అనంతరం వాహనాలను వంతెన మీదికి అనుమతిస్తారు. అయితే ప్రతి ఆదివారం మాత్రం వాహనాలను అనుమతించరు. వంతెనపై ఏర్పాటు చేసిన డైనమిక్‌ లైటింగ్‌ను ఆస్వాదించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వంతెన నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారుల సమక్షంలోనే బ్రిడ్జిపై నగరవాసులకు ఉపయోగపడే ఫుడ్‌, వినోదాత్మక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం పూట వెలుగుజిలుగుల మధ్య మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు వీలుగా మ్యూజిక్‌, కొరియా సాంకేతికతతో డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌, నాలుగు భారీ ఎల్‌ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

కేబుల్‌ బ్రిడ్జి విశేషాలు
►500 మీటర్ల పొడవైన రోడ్డు,
►నాలుగు వరుసల రహదారి.
►26 పొడవైన స్టీల్‌ కేబుల్స్‌..
►ఇటలీ నుంచి తెప్పించినవి.
►వంతెనకు 2 పైలాన్లు,
►రెండు పైలాన్ల మధ్య దూరం
►220 మీటర్లు.
►పైలాన్‌ నుంచి ఇంటర్‌ మీడియన్‌కు దూరం 110 మీటర్లు.
►రూ.180 కోట్ల బడ్జెట్‌..
►పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్‌.
►రూ.8 కోట్లతో కొరియా
►డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌.
►వెడల్పు 21.5 మీటర్లు,
►7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు.
►రోడ్డుకు ఇరువైపులా
►2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు.
►టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం.
►2017 డిసెంబరులో శంకుస్థాపన, 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం.
►2023 జవనరి 26న వంతెనపై పనుల కోసం వాహనాలకు అనుమతి.
►2023 ఏప్రిల్‌ 14న వంతెన ప్రారంభం.

సీఎంకు కరీంనగర్‌  అంటే మమకారం
ఉద్యమ సమయం నుంచి సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌ అంటే ప్రత్యేక అభిమానం. అందుకే నిధుల కేటాయింపులో కరీంనగర్‌కు పెద్దపీట వేస్తారు. రూ.180 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్‌ మంజూరు చేశారు. ఇందులో తీగల వంతెనను ఏప్రిల్‌ 14న కేటీఆర్‌ జాతికి అంకితం చేస్తారు. నగరవాసులకు పూర్తిస్థాయిలో ఉల్లాసం, ఆహ్లాదం కలిగించేందుకు కొంతకాలంపాటు ప్రతి ఆదివారం తీగల వంతెనపై రాకపోకలు నిలిపివేస్తాం. నగరవాసులు సంతోషంగా గడిపేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
– గంగుల కమలాకర్‌, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి

Advertisement
Advertisement