పక్కాప్రణాళిక.. ‘పరుగుల’ ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

పక్కాప్రణాళిక.. ‘పరుగుల’ ప్రయాణం

Feb 4 2026 7:28 AM | Updated on Feb 4 2026 7:28 AM

పక్కాప్రణాళిక.. ‘పరుగుల’ ప్రయాణం

పక్కాప్రణాళిక.. ‘పరుగుల’ ప్రయాణం

ఆస్తిపన్ను వసూలు కోసం అనేక ఒడిదొడుకులు

రూ.60 లక్షల నుంచి రూ.17.75 కోట్లకు ఆదాయం

చెత్త సేకరణకు ఎడ్లబండ్ల నుంచి.. ఆధునిక వాహనాలు

వినూత్న ప్రయోగాలతో సత్ఫలితాలు రామగుండం కార్పొరేషన్‌ ప్రస్థానం

కోల్‌సిటీ(రామగుండం): సుమారు 44 ఏళ్లక్రితం వరకు రామగుండం నోటిఫైడ్‌ ఏరియాగా ఉంది. అప్పటి ఆస్తిపన్ను డిమాండ్‌ రూ.60 లక్షలు. ఇప్పుడు కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగింది. ఆస్తిపన్ను డిమాండ్‌ రూ.19.75 కోట్లకు చేరింది. భౌగోళికంగా విస్తరించడమే కాకుండా ఆదాయ వనరుల పెంపుకోసం బల్దియా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు.

అప్పుడు ఎడ్లబండ్లు.. ఇప్పుడు ఆటో ట్రాలీలు..

గతంలో ఎడ్లబండ్ల ద్వారా ఇంటింటా చెత్త సేకరించేవారు. ప్రస్తుతం ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నారు. నగర విస్తరణకు అనుగుణంగా కొత్తకాలనీలు, వాణిజ్య ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఆస్తిపన్ను పరిధీ విస్తరిస్తోంది. సదుపాయాల కల్పన, పారిశుధ్యం నిర్వహణ, వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతోంది.

కార్పొరేషన్‌ ప్రస్థానం ఇలా..

● జనగామ పంచాయతీతోపాటు 11 గ్రామాలను విలీనం చేస్తూ 1982 జనవరి 19న రామగుండం నోటిఫైడ్‌ ఏరియాగా ప్రకటించారు. అప్పట్నుంచి 1983 వరకు ఆర్డీవో ద్వారా ప్రత్యేక పాలన సాగింది.

● 1995 మే 15న ద్వితీయ శ్రేణి, 2001 ఆగస్టు 3న ప్రథమ శ్రేణి, 2003 నవంబర్‌ 3న ప్రత్యేక శ్రేణి పురపాలక సంఘంగా, 2010 ఫిబ్రవరి 25న నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది.

● 1998 జూన్‌ 6న పురపాలక సంఘం తొలి, 2004 జూన్‌ 22న రెండోసారి ఎన్నికలు జరిగాయి.

● 2014 మార్చి 30న నగరపాలక సంస్థకు తొలిసారి, 2020 జనవరి 22న రెండోసారి నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి.

తొలిమున్సిపల్‌ చైర్మన్‌ ‘సోమారపు’

రామగుండం మున్సిపల్‌కు 1998 జూన్‌ 6న ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికలు జరిగాయి. తొలిచైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ ఎన్నికయ్యారు. 1998 జూన్‌ 6 నుంచి 2003 జూన్‌ వరకు ఆయన మున్సిపల్‌ చైర్మన్‌గా వ్యవహరించారు.

ఆస్తిపన్ను విప్లవానికి నాంది

గుడిసెలు, పెంకుటిళ్లు, రేకుల షెడ్లు.. ఎక్కడోఓచోట కొన్ని భవనాలు రామగుండం తొలిపురపాలక సంఘం పరిధిలోని నివాసాలు. ఏడాదికి గరిష్ఠంగా రూ.60 లక్షల వరకే ఆస్తిపన్ను వసూలయ్యేది. మున్సిపల్‌ కమిషనర్‌ను మినహా ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ సిబ్బంది, కార్మికుల వేతనాలు ఇందులోంచే చెల్లించాల్సి వచ్చేది. వాహనాల ఇంధనం, నిర్వహణ ఖర్చులు, ఇతర కార్యకలాపాలనూ నెట్టుకొచ్చేవారు. ఆదాయం తక్కువ, వ్యయం అధికం కావడంతో ఆర్థికపరిస్థితి సంక్లిష్టంగా మారింది. తొలిమున్సిపల్‌ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ.. వినూత్న ఆలోచనతో ఎన్టీపీసీ, సింగరేణి, ఎరువుల కర్మాగారం వంటి భారీ పరిశ్రమలకు చెందిన ఖాళీ స్థలాలపై ‘వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌’ విధించేందుకు సాహసం చేశారు. దీంతో ఆస్తిపన్ను ఏకంగా రూ.2 కోట్లకు చేరింది. బల్దియా ఆర్థికంగా బలోపేతమైంది. ఇలాంటి ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు, వినూత్న ఆలోచనలే బల్దియాను కార్పొరేషన్‌ స్థాయికి చేర్చాయి.

పారిశుధ్య నిర్వహణ కీలకం..

రామగుండం నగరం నోటిఫైడ్‌ ఏరియా నుంచి కార్పొరేషన్‌ స్థాయికి చేరే ప్రయాణంలో పారిశుధ్యం నిర్వహణ కీలకంగా నిలిచింది. ఎడ్లబండ్లలో చెత్త తరలించే వారికే ఆటోట్రాలీలు కేటాయించింది. వీధుల్లో ప్లాస్టిక్‌ ఏరుకునే పేదలను గుర్తించి ఇంటింటా చెత్త సేకరించే పని కల్పించింది.

చెత్త సేకరణలో వినూత్నతం

ఇంటింటా చెత్త సేకరణ కోసం తొలుత 40 రిక్షాలు కొనుగోలు చేశారు. ర్యాగ్‌ పిక్కర్స్‌ పేరిట పేదలకు వాటిపై ఉపాధి కల్పించారు. ఈ విధానం విజయవంతం కావడంతో మరో 60 రిక్షాలు కొనుగోలు చేశారు. వీటిపై పని చేయడానికి కార్మికులు పోటీపడ్డారు.

పరుగుపందెంతో నియామకం

రిక్షా కార్మికులుగా ఉపాధి కల్పించేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి అవకాశం కల్పిస్తామని పురపాలక సంస్థ తొలిపాలక వర్గం నిబంధన విధించింది. ఇందుకోసం పరుగుపందెం నిర్వహించింది. తద్వారా ఆ కుటుంబానికి ఉపాధి లబించడంతోపాటు ఆర్థిస్థిరత్వం ఏర్పడింది. ఒక్కో ఇంటినుంచి చెత్త సేకరణ ఫీజుగా రూ.20 చొప్పున కార్మికులే వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా బల్దియాపై ఆర్థికభారం కూడా తగ్గింది.

సేంద్రియ ఎరువు తయారీ

చెత్తను వృథా చేయకుండా సేంద్రియ ఎరువుగా మార్చేవిధానాన్ని రామగుండం పురపాలక సంఘం విజయవంతంగా అమలు చేసింది. ఇలా ఆదాయం సాధించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ముందంజ వేసింది.

రామగుండం బల్దియా ప్రొఫైల్‌

డివిజన్లు 60

విస్తీర్ణం(చ.కి.మీ.) 100

స్లమ్‌ ఏరియాలు 50

జనాభా(అంచనా లక్షల్లో) 2.35

ఓటర్లు 1,83,049

అసెస్‌మెంట్లు 51,345

ఆస్తిపన్ను డిమాండ్‌(రూ.కోట్లలో) 19.75

రోజూ వెలువడే చెత్త(మె.టన్నుల్లో) 150

కాంట్రాక్టు కార్మికులు 448

రెగ్యులర్‌ కార్మికులు 43

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement