క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం | - | Sakshi
Sakshi News home page

క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం

Feb 4 2026 7:28 AM | Updated on Feb 4 2026 7:28 AM

క్షణా

క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం

మల్లాపూర్‌: వారందరిదీ నిరుపేద కుటుంబాలు. రెక్కాడితేనే డొక్కాడుతుంది. అలాంటి కూలీలు ఉపాధి కోసం మండలంలోని మొగిలిపేటకు చెందిన ఎర్రంశెట్టి గంగాధర్‌ రైతు పొలంలో పసుపు ఏరడానికి ట్రాక్టర్‌లో వెళ్లారు. సుమారు 15 మంది కూలీలతో గంగాధర్‌ తన సొంత ట్రాక్టర్‌లో బయల్దేరాడు. తోటి కూలీలుతో సరదాగా మాట్లాడుకుంటూ అలసట మర్చిపోయి పొద్దంతా పనులు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం సమయంలో గంగాధర్‌ ట్రాక్టర్‌లోనే ఇంటికి బయల్దేరారు. మరో 10 నిమిషాల్లో ఇళ్లు చేరేదే. అంతలోనే ట్రాక్టర్‌ను గంగాధర్‌ స్పీడ్‌గా నడపడంతో రోడ్డు పక్కనున్న నీటి గుంతలో పడిపోయింది. ఆ కూలీలను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంగళారపు లలిత (45), పెద్దిరెడ్డి గంగు(45), సంపంగి సాయమ్మ(38), రొడ్డ వైష్ణవి(13) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అంతా క్షణాల్లోనే జరగడంతో ఏం జరిగిందో కూడా కూలీలకు అర్థం కాలేదు. ఆర్తనాదాల మధ్య స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులు క్షతగాత్రులను ప్రైవేటు వాహనాలు, 108లో మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన సంపంగి సాయమ్మది నిరుపేద కుటుంబం. భర్త ఎల్లయ్య ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. ఇద్దరు పిల్లలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది. పెద్దిరెడ్డి గంగు భర్త గంగాధర్‌ ఆర్థిక ఇబ్బందులతో ఐదేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూనే ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. రొడ్డ పోశయ్య, అనిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. రెండో కుమార్తె వైష్ణవి స్థానిక ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి చదువుకుంటూనే కుటుంబానికి అండగా నిలవాలని అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తోంది. మంగళారపు లలితకు భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ధర్మరాజు నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటున్నాడు. పెద్ద కూతురుకు వివాహం జరిపించాడు. మిగిలిన కూతుళ్లు, కుమారుడిని చదివించేందుకు లలిత కూలీ పనులకు వెళ్తోంది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, నాయకులు, అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ చిట్నేని రఘు హామీ ఇచ్చారు. తహశీల్దార్‌ శ్రీనివాస్‌, సీఐ అనిల్‌కుమార్‌, ఎస్సైలు అనిల్‌, కిరణ్‌, నవీన్‌కుమార్‌ మృతదేహాలను పరిశీలించారు. పోలీసుల అదుపులో ట్రాక్టర్‌ యజమాని ప్రమాదానికి కారణమైన ఎర్రంశెట్టి గంగాధర్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

కూలీ పనులకు వెళ్లి విగతజీవులుగా

ఇంటికి తిరిగొస్తూ.. కానరానిలోకాలకు..

నలుగురి మృతి.. మరో ఎనిమిదిమందికి గాయాలు

మల్లాపూర్‌ మండలం మొగిలిపేటలో విషాదం

క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం1
1/3

క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం

క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం2
2/3

క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం

క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం3
3/3

క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement