కామారెడ్డి టౌన్: ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, భూ గర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకొని రైతులు సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ సూచించారు. చిన్నమల్లారెడ్డి గ్రామంలోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడా రు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి సంజయ్ జాజుల ఆదేశాల మేరకు ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని పంటల ప్ర ణాళిక రూపొందించుకోవాలని కోరారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలాలు సగటున 4 మీటర్ల మేర పడిపోయాయని కలెక్టర్ తెలిపారు. దీంతో అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా కంది, పెసర, మినుములు, శనగలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న వంటి ఆరుతడి, పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 72 రైతు వేదికల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో సుమారు 5 వేల మంది రైతులు, అధికారులు పాల్గొని సాగు పద్ధతులపై చర్చించినట్లు వివరించారు.
పంటల వైవిధ్యం, సమగ్ర వ్యవసాయంతో అదనపు లాభాలు సాధిస్తున్న రైతుల అనుభవాలను కలెక్టర్ కొనియాడి వారిని అభినందించారు. చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ మూడు ఎకరాల్లో పసుపు, ఉల్లి, పెసర్లు సాగు చేస్తూనే, అర ఎకరంలో వేసిన డ్రాగన్ ఫ్రూట్ ద్వారా ఏటా రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారని, వర్షపు నీటి నిల్వకు కుంట ఏర్పాటు చేసి సహజ పద్ధతుల్లో సాగు చేస్తున్నారని తెలిపారు. గాంధారి మండలం గుడిమెట్ గ్రామ రైతు తన పొలంలో వరిని తగ్గించి పామాయిల్ సాగు ప్రారంభించారని, అందులో అంతర పంటలుగా పత్తి, మునగ, బంతిపూలు సాగు చేస్తూ నిరంతర ఆదాయం పొందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ ధర్మగోని లక్ష్మి, సర్పంచ్ బీమాయాల లక్ష్మి, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, ఉద్యాన శాఖ అధికారిణి జ్యోతి, తహసీల్దార్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
వరికి బదులు చిరుధాన్యాలు,
పప్పుధాన్యాలు వేయాలి
జిల్లాలో 4 మీటర్లు తగ్గిన
భూగర్భ జలాలు
‘రైతునేస్తం’లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


