● గడువులోగా పూర్తి చేయాలి
● వీసీలో దేవాదాయశాఖ
ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్
నిజామాబాద్ అర్బన్: గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ సూచించారు. పుష్కరాల పనుల నిర్వహణపై ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావుతో కలిసి సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజారామయ్యర్ మాట్లాడుతూ.. గోదావరి తీరంలో నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో చేపట్టిన పనులపై సమీక్షించారు. దేవాదాయ, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పర్యాటక, తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై కీలక సూచనలు చేశారు. నూతన పుష్కర ఘాట్‌ల నిర్మాణం, ఘాట్‌ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి తదితర నిర్మాణాల పనులు గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లాలోని కందకుర్తి, యంచ తదితర ప్రాంతాల్లో పనులను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


