● కరెంట్ లేక ఎండిపోతున్న పొలాలు
● కాపాడుకునేందుకు అన్నదాతల పాట్లు
పిట్లం(జుక్కల్)/ మద్నూర్: వర్షాలు పడక, కరెంటు కోతలతో విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈక్రమంలో పంటను దక్కించుకోవడానికి కొందరు రైతులు నానాపాట్లు పడుతున్నారు. కొందరు రైతులు పంట చేతికొచ్చే సమయానికి కరెంటు లేక గత్యంతరం లేక వేల రూపాయలు ఖర్చు చేస్తూ జనరేటర్‌ను పెట్టి పంటల పొలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పంట పెట్టుబడులతోపాటు జనరేటర్ల ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు గ్రామానికి దగ్గరగా ఉన్న బోర్ల నుంచి పైప్‌లైన్ ద్వార పంట పొలాలకు నీటిని తరలిస్తున్నారు. ఇంకొందరు పొలాల వద్దే ఉంటూ కరెంట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ కరెంట్ వచ్చినప్పుడు పొలాలకు నీటిని అందిస్తున్నారు. ఇలా పొలాలలకు నీటిని అందించేందుకు రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
కరెంట్ కోసం ధర్నాలు..
పిట్లం మండలంలోని దాదాపు అన్ని గ్రామాలలో పంటలకు సరిపడ విద్యుత్ సరఫరా కాకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయి. పంటలకు సరిపడ విద్యుత్ ఇవ్వాలని రైతులు సబ్‌స్టేషన్ల ముందు, రోడ్లపై కూర్చొని ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వ్యవసాయ రంగానికి నిరంతరంగా 12 గంటలు విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


