వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

Oct 11 2026 1:27 AM | Updated on Oct 11 2026 1:27 AM

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు మృతిచెందారు. బోధన్‌ మండలంలో ఆర్మీ జవాన్‌ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత చెందాడు. వేల్పూర్‌ మండలంలో ఓ వ్యక్తి చెరువులో మునిగి, లింగంపేట మండలంలో ఓ యువకుడు మైనింగ్‌ గుంతలో పడి చనిపోయారు.

బోధన్‌టౌన్‌(భోధన్‌): పట్టణంలోని నిజామాబాద్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. బోధన్‌ మండలం అమ్దాపూర్‌ గ్రామానికి చెందిన నవాతే రక్షిత్‌ (26) ఆర్మీ జవాన్‌గా కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. అతడు శుక్రవారం రాత్రి బైక్‌పై బోధన్‌ నుంచి ఎడపల్లికి బయలుదేరాడు. ఆచన్‌పల్లి సమీపంలోని జియో పెట్రోల్‌ బంక్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా, వెంటనే స్థానికులు నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతు డి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

మైనింగ్‌ గుంతలో పడి యువకుడు..

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొర్పోల్‌ గ్రామ శివారులోని మైనింగ్‌ గుంతలో పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై దీపక్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన సురేశ్‌(28) శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని మైనింగ్‌ గుంత వద్దకు కాలకృత్యాలకు వెళ్లాడు. అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం మైనింగ్‌ గుంత వద్ద సురేష్‌ బైక్‌ కనిపించడంతో గ్రామస్తులు గుంతలో వెతికారు. సురేష్‌ మృతదేహం లభ్యమవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే కాంట్రాక్టర్‌ మహేశ్వర్‌రెడ్డి మైనింగ్‌ చేపట్టి గుంతలను పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా మారినట్లు గ్రామస్తులు ఆరోపించారు. గుంత లోతు ఎక్కువగా ఉండడంతో పశువులు, మనుషులు పడి మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్టర్‌ నష్టపరిహారం చెల్లించి గుంతను పూడ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎస్సైకి వినతిపత్రం అందజేశారు.

చెరువులో మునిగి ఒకరు..

వేల్పూర్‌: మండలంలోని పడగల్‌ ఊరచెరువులో మునిగి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై సంజీవ్‌ తెలిపిన వివరాలు ఇలా.. దొనకంటి అడెల్లు(51) అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం పడగల్‌ గ్రామానికి వలస వచ్చి రజక వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం అతడు భార్య, కూతురుతో కలిసి స్థానిక ఊరచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లాడు. బట్టలు ఉతికిన తర్వాత అడెల్లు స్నానానికి చెరువు లోపలికి వెళ్లి ఊపిరాడక మృతిచెందాడు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గుండెపోటుతో మున్సిపల్‌ కార్మికుడు

నిజామాబాద్‌ రూరల్‌/నిజామాబాద్‌ అర్బన్‌: నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ విధానం పనిచేస్తున్న ఓ కార్మికుడు విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని మంగ్లీపెళ్లి భూమయ్య(54) అనే వ్యక్తి మున్సిపల్‌ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. నగరంలోని 57వ డివిజన్‌లోని ముస్తేద్‌పుర కాలనీ సర్కిల్‌ 3లో శనివారం అతడు విధులు నిర్వహిస్తున్న సమయంలో మొదట ఫిట్స్‌ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జీవన్‌, సిబ్బంది అతడిని నగరంలోని జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఫిట్స్‌ వచ్చిన అనంతరం అతడికి గుండెపోటు రావడంతో మృతి చెందాడని ధ్రువీకరించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు బోరున విలపించారు.

డీసీఎం కిందపడి ఒకరు..

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని 5వ టౌన్‌పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం మధ్యాహ్నం డీసీఎం కిందపడి ఒకరు మృతిచెందారు. ఖిల్లా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ యూసుఫ్‌అలీ నిలిచి ఉన్న డీసీఎం వెనక నిలబడి ఉండగా, వాహనం వెనకకురావడంతో అతడు చక్రాల కింద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement