● తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయం
● అంతర పంటల సాగుతో
అదనపు లాభాలు
మాచారెడ్డి: సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి మాచారెడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 58 మంది రైతులు 133 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. దీర్ఘకాలం దిగుబడినిచ్చే ఈ పంటలో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండటంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన రైతు ఉప్పు రాములు రెండెకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం మొక్కలు నాటగా, ఏడాది నుంచి గెలలు రావడం ప్రారంభమైందని తెలిపారు. ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు, చిన్న పండ్ల మొక్కలను సాగు చేసుకోవచ్చని రాములు తెలిపారు. భూమి స్వభావం, నీటి లభ్యతను బట్టి వరి వంటి పంటలను కూడా సాగు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాన పంట నుంచి దిగుబడి వచ్చే వరకు అంతర పంటల ద్వారా కొంత ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ పంట మూడేళ్ల తర్వాత గెలలు ఇవ్వడం ప్రారంభించి, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సుమారు 30 ఏళ్ల వరకు దిగుబడినిచ్చే అవకాశం ఉందని రైతు రాములు వివరించారు.


