బాన్సువాడ : పంట కాలువల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో రైతులు పంట కాలువలను శుభ్రం చేసుకున్నారు. మండలంలోని నిజాంసాగర్ ఉప కాలువ డిస్టిబ్యూటర్–25 ద్వారా దామరంచ, కొల్లూర్, నాగారం శివారుల్లోకి పంటలకు సాగు నీరందుతుంది. చివరి ఆయకట్టుకు సాగునీరు రాకపోవడంతో కొల్లూర్ సర్పంచి నాందేవ్ ఆధ్వర్యంలో రైతులను నాలుగైదు రోజులుగా కొల్లూర్, నాగారం, దామరంచ రైతులతో పంట కాలువలను శుభ్రం చేయించారు. ఆడపదడపా కురుస్తున్న వర్షాల కారణంగా పంట కాలువల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. రైతులు కాలువలను బాగు చేసుకున్న విషయం తెలుసుకున్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా పంట కాలువలను సందర్శించి చివరి ఆయకట్టకు నీరందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.


