సదాశివనగర్: రైతుల అభిప్రాయం లేకుండా పీఏసీఎస్‌లకు నామినేటెడ్ పద్ధతిలో భర్తీ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సాయ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓడిపోతామని భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ వైపు వెళ్తుందని ఆరోపించారు. రైతులు కరెంటు కొరతతో రోడ్డెక్కి ఇబ్బందులు పడుతుంటే ప్రభు త్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎల్లారెడ్డి సోషల్ మీడియా ఇన్‌చార్జి శ్రీకాంత్ రెడ్డి, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి:నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామసభలో వీవోఏ మాధవిపై కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన ఆ గ్రామ ప్రజాప్రతినిధిని శిక్షించాలని కామారెడ్డి జిల్లా వీవోఏల సంఘం అధ్యక్షుడు శివరాం నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మాచారెడ్డిలో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా దూషించిన నిందితుడిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
ఎల్లారెడ్డిరూరల్: బార్‌లపై విధించిన ప్రివిలేజ్ ట్యాక్సును రద్దు చేయాలని కోరుతూ ఎల్లారెడ్డిలో సోమవారం బార్ నిర్వాహకులు బంద్ చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం బార్ నిర్వాహకులపై విధించిన ప్రివిలేజ్ ట్యాక్సును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా రెండు రోజుల పాటు బార్ బంద్ చేస్తున్నట్లు నిర్వాహకులు నారాయణ తెలిపారు.
బీబీపేట: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రానికి చెందిన బీఈడీ అధ్యాపకులు వి.వీరాచారి ఉత్తమ అధ్యాపకులు ఎంపికయ్యారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో టీచర్ ప్లస్ ఈ లెర్నింగ్ అకాడమీ ఆధ్వర్యంలో గురువందనం స్టేట్ బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్స్ అవార్డు 2026 అందుకున్నారు. వీరాచారి మెదక్ జిల్లాలో వైపీఆర్ బీఎడ్ కళాశాల పని చేస్తున్నారు. వీరాచారిని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు సునీత, లలిత, సుధాకర్ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్‌అడ్మినిస్ట్రేషన్ ఆచార్యులు శంకర్, గంట చంద్రశేఖర్ టీచర్ ప్లస్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ వేద ప్రకాష్ ఘనంగా సన్మానించారు.


