ముగ్గురు మొనగాళ్లు! | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు మొనగాళ్లు!

Oct 4 2026 12:31 PM | Updated on Oct 4 2026 12:31 PM

ముగ్గురు మొనగాళ్లు! ● సాహసమే ఊపిరి.. విజయమే లక్ష్యం ● చిరుతలా పరుగులు తీస్తున్న కౌశిక్‌ ● సైనికుడిలా దూసుకుపోతున్న శ్రీవాత్సవ్‌ ● మంచుకొండలను చుట్టేస్తున్న బన్నీ పర్వతారోహణలో బన్నీ..

ఎన్‌సీసీలో ప్రతిభ చాటుతున్న శ్రీవాత్సవ్‌

నేటి తరం విద్యార్థులు పుస్తకాలు, మార్కులకే పరిమితం కావడం లేదు. తమ అభిరుచులకు అనుగుణంగా ఆలోచనలకు పదును పెడుతూ, విభిన్న రంగాల్లో ప్రతిభను చాటుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సూదం కౌశిక్‌ పరుగుల్లో రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తుండగా.. కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కాలేజీలో ఫైనలియర్‌ చదువుతున్న విస్లావత్‌ బన్నీ ఒక్కో పర్వతాన్ని అధిరోహిస్తూ ఎవరెస్టు వైపు అడుగులు వేస్తున్నాడు. కామారెడ్డికి చెందిన కందుకూరి శ్రీవాత్సవ్‌ కఠినమైన క్రమశిక్షణతో కూడిన ఎన్‌సీసీలో చురుకై న పాత్ర పోషిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఇలా విభిన్న రంగాల్లో సత్తాచాటుతున్న యువ విద్యార్థులపై ‘సండే స్పెషల్‌’..

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

రాజంపేట మండలం ఎల్లాపూర్‌ తండాకు చెందిన విస్లావత్‌ బన్నీ.. కామారెడ్డి పట్టణంలోని గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. పర్వతాలను అధిరోహిస్తూ జిల్లా కీర్తిని ఇనుమడింపజేస్తున్నాడు. చదువుతూనే మంచుపర్వతాలను అధిరోహిస్తున్న బన్నీని గిరిజన గురుకుల కళాశాలల ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. గతంలో కిలిమంజారో, కాంగ్‌ యాత్సే, లడక్‌ కియాగర్‌ రి పర్వతాలు అధిరోహించాడు. ఇటీవల 6,027 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్‌ తరంగ్‌ 2 ను విజయవంతంగా అధిరోహించాడు. పేద గిరిజన కుటుంబానికి చెందిన బన్నీ కఠోరమైన శ్రమతో పర్వతాలను అధిరోహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఎవరెస్ట్‌ ఎక్కాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన శ్రీవాత్సవ్‌ హైదరాబాద్‌లోని లయోలా అకాడమీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నాడు. క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలకు మారుపేరుగా నిలిచే ఎన్‌సీసీ విభాగంలో అఖిల భారత స్థాయిలో ప్రతిభ చాటుతున్నాడు. ఇటీవల ఎన్‌సీసీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి పది మంది జాతీయ స్థాయికి ఎంపికవగా.. అందులో శ్రీవాత్సవ్‌ ఒకరు. అబ్‌స్టాకిల్స్‌ జాతీయ స్థాయిలో ఇటీవల నిర్వహించిన ఆల్‌ ఇండియా దళ్‌ సైనిక్‌ క్యాంప్‌లో భాగంగా దేశంలోని 17 ఎన్‌సీసీ డైరెక్టరేట్ల నుంచి టీంలు రాగా.. తెలంగాణ, ఏపీ ఒకే జట్టుగా వెళ్లి గోల్డ్‌మెడల్‌ సాధించాయి. శ్రీవాత్సవ్‌ లయోలా అకాడమీలో ఎన్‌సీసీ సీనియర్‌ అండర్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీవాత్సవ్‌ సాధిస్తున్న విజయాలను చూసి గర్వంగా ఉందని అతడి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న సూదం కౌశిక్‌ ఇటీవల 42 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్నాడు. మూడు నెలల పాటు కఠోరంగా శ్రమించి, రన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అతడు ఇంతకు ముందు 5 కిలోమీటర్లు, పది కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు.. ఇలా వివిధ మారథాన్‌లలో పాల్గొని 23 సార్లు ప్రతిభ కనబరిచి మెడల్స్‌ సాధించాడు. భారత సైన్యంలో చేరాలన్న లక్ష్యంతో పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే తన సాధన కొనసాగిస్తున్నాడు. నిత్యం ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం రెండు గంటలు శారీరక వ్యాయామాలతోపాటు పరుగులు పెడుతూ లక్ష్య సాధన కోసం చెమటోడుస్తున్నాడు. దేశ సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న తన కుమారుడు కౌశిక్‌.. మారథాన్‌లో రికార్డులు సాధిస్తుండడంపై అతడి తల్లి స్రవంతి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement