● రైతుల డిమాండ్
● విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన
బిచ్కుంద: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ శనివారం మండలంలోని శాంతాపూర్, సీతారాంపల్లి, మాణ్యాపూర్, జగన్నాథ్‌పల్లి, ఎల్లారం గ్రామాల రైతులు శాంతాపూర్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం జగన్నాథ్‌పల్లి గేటు వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోజూ ఆరు గంటల కరెంటు మాత్రమే వస్తోందని, అదీ విడతలవారీగా సరఫరా అవుతోందని పేర్కొన్నారు. లోవోల్టేజీతో శుక్రవారం ఒక్కరోజే ఇరవై బోరు మోటార్లు కాలిపోయాయని శాంతాపూర్, సీతారాంపల్లి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరి ఈత దశలో ఉందని, నీరు అందకుంటే దిగుబడి పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై రాజు రైతులకు సముదాయించారు. విద్యుత్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడించారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
రాస్తారోకో చేస్తున్న రైతులు


