పోచారం ప్రాజెక్టుకు మహర్దశ! | - | Sakshi
Sakshi News home page

పోచారం ప్రాజెక్టుకు మహర్దశ!

Oct 4 2026 12:31 PM | Updated on Oct 4 2026 12:31 PM

● పర్యాటక అభివృద్ధి కోసం

రూ.3 కోట్లు మంజూరు

● ఎమ్మెల్యే చొరవతో మారనున్న

జలాశయం రూపురేఖలు

నాగిరెడ్డిపేట: శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టుకు మహర్దశ రాబోతోంది. ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించింది. దీంతోపాటు గతేడాది వచ్చిన భారీ వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టు కట్టకు మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే రూ.3.58 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. డీఆర్‌ఐపీ–3(డ్రిప్‌–డ్యాం రీహబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌) పథకం ద్వారా ప్రాజెక్టు వద్ద మరిన్ని అబివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ పనులకోసం ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చొరవ తీసుకుంటున్నారు. పనులు పూర్తయితే ప్రాజెక్టు రూపురేఖలు మారుతాయని భావిస్తున్నారు.

చేపట్టే పనులివే..

మంజూరైన నిధులతో పోచారం ప్రాజెక్టు వద్దనున్న అతిథి గృహానికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురానున్నారు. దీంతోపాటు పర్యాటకుల సౌకర్యార్థం టాయ్‌లెట్స్‌ నిర్మిస్తారు. ప్రాజెక్టు వద్దకు వచ్చే పిల్లలకు ఆటవిడుపుగా ఉండే ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నింటిని నీటిపారుదలశాఖ ద్వారా చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరులోపు అధికారులు టెండర్లను స్వీకరించనున్నారు.

మరమ్మతులకు..

గతేడాది వచ్చిన భారీ వరదల కారణంగా ప్రాజెక్టు కుడివైపు బ్రిడ్జి వద్ద మట్టి కొట్టుకుపోయింది. అక్కడ రిటెయినింగ్‌ వాల్‌ నిర్మించేందుకు రూ.1.24 కోట్లు కేటాయించారు. అలాగే ప్రాజెక్టు ఎడమవైపు ఉన్న చిన్న అలుగు మరమ్మతులకు రూ. 2.34 కోట్లు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి అధికారులు టెండర్ల స్వీకరణ ప్రక్రియను పూర్తిచేశారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

వంతెన పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు..

1989లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు 1.29 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు వద్దనున్న అతిథి గృహానికి వెళ్లేందుకు ఉన్న వంతెన కోతకు గురై తెగిపోయింది. డ్యాం రీహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌(డ్రిప్‌)–3 ద్వారా వంతెనను పునర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీంతోపాటు ప్రాజెక్టుపై సోలార్‌ లైట్ల ఏర్పాటు, ప్రాజెక్టు మట్టికట్టపై పిట్టగోడ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చి నిధులు మంజూరుకాగానే పనులను ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement