● పారదర్శకమైన ఓటర్ల జాబితా
రూపకల్పనకు ప్రాధాన్యత
● ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవి
కామారెడ్డి క్రైం: అర్హులైన పౌరులందరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు పారదర్శకమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడానికి ప్రాధాన్యతనిస్తున్నామని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీదేవి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆమెకు అదనపు కలెక్టర్ విక్టర్, అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సర్ ప్రక్రియపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఓటర్ల నమోదు, జాబితా శుద్ధీకరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాను శుద్ధీకరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఓటు హక్కు పొందే యువతలో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ 78 శాతం పూర్తయ్యిందని అధికారులు వివరించారు. పారదర్శకమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరి, ఆర్డీవో ప్రభాకర్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


