కామారెడ్డి టౌన్ : మున్సిపల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు రూ. 200 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవిని కోరారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన సీడీఎంఏను ఆమె కలిశారు. పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి రోడ్ల విస్తరణ, ఆధునిక డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణం, మెరుగైన పారిశుధ్య నిర్వహణతో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు.
తాడ్వాయి: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలను మాత్రమే వేయాలని వ్యయసాయ శాఖ జిల్లా అధికారి మోహన్‌రెడ్డి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు శనగ విత్తనాల మినీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, సాంకేతిక సలహాలు, ఇతర వ్యవసాయ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణా సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ వినయ్, ఏవో నర్సింలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
మద్నూర్/బిచ్కుంద: దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారిని కొత పెన్షన్‌లకు గుర్తించాలని జెడ్పీ సీఈవో చందర్ నాయక్ సూచించారు. శనివారం ఆయన డోంగ్లీ మండలంలోని మదన్‌హిప్పర్గా, ఇలేగావ్, ఎన్‌బురా, కుర్లా, బిచ్కుంద మండలంలోని హజ్గుల్, పుల్కల్‌లలో పర్యటించారు. పింఛన్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. డోంగ్లీలో ఫాంపాండ్స్ పనుల పురోగతిని, కుర్లాలో సోక్ పిట్‌ల పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవోలు జగదీశ్, గోపాల్, బిచ్కుంద ఎంపీవో కృష్ణ తదితరులున్నారు.
గాంధారి: అధ్యాపకులు, విద్యార్థులు సమయ పాలన పాటించాలని, క్రమశిక్షణతో మెలగాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకులతో ప్రార్థనలో పాల్గొన్నారు. అధ్యాపకులు అంకిత భావంతో పనిచేయాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని సూచించారు.
రామారెడ్డి: ఆలయంలో అనుమతి లేకుండా ఎలాంటి ప్రచారాలు చేయరాదని, ఫొటోలు తీసుకోకూడదని మండలకేంద్రంలోని శ్రీకాలభైరవ స్వామి దేవస్థానం ఈవో ప్రభు గుప్తా పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాలభైరవ స్వామి దేవస్థానంలో ఇటీవల ఓ వ్యక్తి స్వామివారి మూలవిరాట్ వద్ద కొంత నగదును ఉంచి ఫొటోలు తీసుకున్నారు. ఇది వివాదాస్పదంగా మారడంతో ఈవో ప్రభు గుప్తా స్పందించారు. సదరు వ్యక్తి ఆ సొమ్మును హుండీలో వేయలేదని, ఆలయ ధర్మకర్తలకుగానీ, చైర్మన్‌కుగానీ, ఈవోకు లేదా ఇతర దేవస్థాన సిబ్బందికిగానీ అందజేయలేదన్నారు. మూలవిరాట్ వద్ద నగదుతో ఫొటో దిగిన వ్యక్తిని వివరణ కోరుతూ నోటీసు జారీ చేశామన్నారు.


