● సీఎంఆర్ లెక్కలు తీస్తున్నారు
● స్టాక్ లేకుంటే కేసులు నమోదు
● జిల్లాలో ఇప్పటికే రెండు మిల్లుల్లో తనిఖీలు
జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్‌కు సంబంధించి 4.68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను 127 మిల్లులకు కేటాయించారు. మిల్లింగ్ తర్వాత 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారు. ఇంకా 1.88 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, బియ్యం ఇచ్చేందుకు అక్టోబర్ నెలాఖరు వరకు అవకాశం ఉంది. అలాగే గత యాసంగి సీజన్‌లో 4.66 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని 123 మిల్లులకు ఇచ్చారు. మరపట్టిన తర్వాత 3.13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పటి వరకు 35 వేల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 2.78 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాలి.
ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నా..
మిల్లులకు ఇచ్చిన ధాన్యం నిల్వలపై ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తోంది. కామారెడ్డిలో ఇటీవల ఒక మిల్లులో తనిఖీలు చేపట్టి రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం లేదని కేసు నమోదు చేశారు. బాన్సువాడ సమీపంలోని ఓ రైస్‌మిల్లులోనూ తనిఖీలు జరిగాయి. అక్కడ కూడా ధాన్యం మాయమైందని గుర్తించారు. గతేడాది రెండు సీజన్లలో కలిసి దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఆయా మిల్లుల్లో ధాన్యం లేదా బియ్యం నిల్వలు ఉన్నాయా లేదా అన్న విషయంలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తోంది. ఏ మిల్లులోనైనా ఉండాల్సిన స్టాక్ లేదంటే ధాన్యాన్ని అమ్ముకున్న కిందే లెక్క. పౌరసరఫరాల సంస్థకు సంబంధించి విజిలెన్స్ విభాగం ఎక్కడ తనిఖీ నిర్వహించినా లెక్కలు సరితూగడం లేదు. రూ. కోట్ల విలువైన ధాన్యం దారి తప్పినట్టు గుర్తిస్తున్నారు. జిల్లాలో రెండు మిల్లుల్లో తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన మిల్లర్లను వెన్నాడుతోంది. దాడులను ఎదుర్కొనే విషయంలో ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నా.. తనిఖీలు మాత్రం ఆగడం లేదు.
రైస్‌మిల్లుల్లో సీఎంఆర్ నిల్వలపై విజిలెన్స్ ఫోకస్ చేసింది. తనిఖీల్లో లెక్క ప్రకారం స్టాక్ లేకుంటే కేసులు నమోదు చేస్తున్నారు. గడిచిన పది రోజుల్లో జిల్లాలో రెండు మిల్లుల్లో తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేశారు. దీంతో మిల్లర్లు వణుకుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


