కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జీవదాన్ హైస్కూల్ 7వ తరగతి విద్యార్థి షేక్ అక్బరుద్దీన్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రెండో ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో కటా విభాగంలో బంగారు పతకం సాధించారు. అక్బరుద్దీన్ బంగారు పతకం సాధించడంపై కామారెడ్డి రాజీవ్‌నగర్‌కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ ప్రతినిధులు తాజొద్దీన్, రాజు, మాలజంగం స్వామి, ఇమ్రత్ సింగ్ తదితరులు అభినందించారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ఏటీసీలో రిపోర్టు చేయడానికి గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీధర్‌రాజ్ తెలిపారు. 2026–2027 విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు రిపోర్టు చేయని శిక్షణార్థులు ఈ నెల 4వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని శిక్షణార్థులు సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా రిపోర్టు చేయాలని సూచించారు.
కామారెడ్డి అర్బన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ఐక్య ఉద్యమాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ విద్యారంగంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో అనేక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15లోగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. పీఆర్‌సీ గడువు ముగిసి మూడేళ్లు అవుతున్న మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శులు చావ దుర్గాభవానీ, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శాంతికుమారి, సత్యానంద్, మల్లారెడ్డి, రాజు, రవిప్రసాద్‌గౌడ్, శ్రీధర్, యాకయ్య, కిష్టయ్య, జ్ఞానమంజరి, మస్తాన్‌రావు, మాణిక్‌రెడ్డి, కొండల్‌రావు, వెంకటప్ప, సింహాచలం, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుల బాబు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.


