కామారెడ్డి క్రైం: ఆపరేషన్ ముస్కాన్–12లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 45 మంది బాల కా ర్మికులను గుర్తించినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర ఆదివారం తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న బాలలను గుర్తించి రక్షించడం, వారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడమే లక్ష్యంగా జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యా, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇటుక బట్టీలు, దుకాణాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. మొత్తం 45 మంది బాలలను రక్షించగా, అందులో 41 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై మొత్తం 23 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. రక్షించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం తల్లిదండ్రులకు అప్పగించడం, అవసరమైన చిన్నారులకు సంరక్షణ, పునరావాసం కల్పించడం, విద్యాభ్యాసం కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆపరేషన్ ముస్కాన్‌లో
45 మంది బాలల గుర్తింపు
23 కేసుల నమోదు
ఎస్పీ రాజేశ్‌చంద్ర


