సరిపడా దిగుబడి లేక..
● రెండునెలల్లో రెట్టింపు..
● పంటల దిగుబడి తగ్గడంతో
పెరుగుతున్న ధరలు
ఎల్లారెడ్డిరూరల్: అల్లం, వెల్లుల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు నెలల్లోనే దాదాపు రెట్టింపయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దాదాపు అన్ని వంటకాలలో అల్లం, వెల్లుల్లి వినియోగిస్తుంటారు. అయితే రెండు నెలల క్రితం అల్లం, వెల్లుల్లి ధర కిలోకు రూ. 120 ఉండగా.. ప్రస్తుతం అల్లం ధర రూ. 240కి చేరింది. వెల్లుల్లి ధర రూ. 250 పలుకుతోంది. వేసవి కాలం పచ్చళ్ల సీజన్ కావడంతో అల్లం, వెల్లుల్లిలకు డిమాండ్ పెరిగింది. దేశంలో కేరళ ప్రాంతంలో నాణ్యమైన అల్లం సాగు అధికంగా ఉంటుంది. మహారాష్ట్ర ప్రాంతంలో సాధారణ రకానికి సంబంధించిన అల్లం సాగవుతుంది. నాణ్యమైన వెల్లుల్లి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో సాగవుతుంది. ఆయా ప్రాంతాలలో ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి.
అల్లం కేరళ నుంచి, వె ల్లుల్లి యూపీ, ఎంపీ, రాజస్థా న్ నుంచి వస్తుంది. సరిపడా దిగుబడి లేకపోవడంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. కొ త్త పంట వస్తేనే ధరలు తగ్గే అవకాశాలున్నాయి. – మన్సూర్, వ్యాపారి, ఎల్లారెడ్డి


