● యూరియా దొరక్క రైతుల ఇబ్బందులు
● నిమిషాల వ్యవధిలోనే
యాప్‌లో బుకింగ్ పూర్తి
● సింగిల్ విండోల ఎదుట రైతుల నిరసన
భిక్కనూరు: రెండు నిమిషాల వ్యవధిలో 4వేలకు పైగా యూరియా బస్తాలు బుకింగ్ అయిపోవడంతో రైతులు అవాక్కయ్యారు. యూరియా యాప్‌పై అవగాహన లేకపోవడం, సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యల కారణంగా రైతులకు అవస్థలు తప్పడం లేదు. సోమవారం మూడు గంటలకు యాప్‌లో యూరియా బుక్ చేసుకోవాలని వ్యవసాయాధికారులు ప్రచారం నిర్వహించారు. రైతులు తమ పనులను మానుకుని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొబైల్‌ఫోన్‌లు పట్టుకుని కూర్చుని సరిగ్గా 3గంటలకు యూరియా బుక్ చేసేందుకు యాప్‌ను ఓపెన్ చేయగా రెండు నిమిషాల్లోనే నో స్టాక్ దర్శనమిచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురై మండలకేంద్రంతోపాటు పెద్దమల్లారెడ్డి, తిప్పాపూర్, అంతంపల్లి, రామేశ్వర్‌పల్లి, బబస్వాపూర్, జంగంపల్లి గ్రామాల్లోని సింగిల్‌విండోల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలంలోని భిక్కనూరు, బస్వాపూర్, రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్, జంగంపల్లి, అంతంపల్లి విండోల్లో 444 చొప్పున, పెద్దమల్లారెడ్డిలో 888, భిక్కనూరులోని మన గ్రోమోరులో 450 మొత్తం 4002 బస్తాల యూరియా స్టాక్ ఉన్నట్లు యాప్‌లో చూపింది. అయితే మొత్తం యూరియా కేవలం రెండు నిమిషాల్లో బుక్ అయిపోవడంతో రైతులు తీవ్ర అందోళనకు గురయ్యారు.


