ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలి
బిచ్కుంద: తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటవెంటనే రైస్‌మిల్లులకు పంపించాలని ఇన్‌చార్జి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పుల్కల్‌లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల, అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రోజూ వర్షం పడుతోందని, దీంతో వడ్లు ఎండడం లేదని సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, రైతులు కలెక్టర్‌తో పేర్కొన్నారు. పుల్కల్‌లోని బాయిల్డ్ రైస్‌మిల్లుకు వడ్లను తరలించాలని కోరారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో ఫోన్ ద్వారా మాట్లాడించారు. తడిసిన వడ్లను ఇతర రైస్‌మిల్లులకు తరలిస్తే నాణ్యత లేదని తిరిగి పంపిస్తారని, అందుకు బాయిల్డ్ రైస్ మిల్లుకు పంపించాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులకు నష్టం జరగకుండా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తూకం వేసిన వడ్లకు సంబంధించిన ఆన్‌లైన్ ఎంట్రీలను వేగవంతం చేసి మిల్లర్లకు రసీదులు సకాలంలో అందేలా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్‌వో వెంకట్, డీసీవో రామ్మోహన్, సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, డీటీ భరత్ ఉన్నారు.


