
ఎన్నికల నియమావళిని పాటించాలి
● కోడ్ ఉల్లంఘించేవారిపై
చర్యలు తప్పవు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయన్నారు. తొలి విడతలో కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలోని 13 మండలాల(గాంధారి మినహా) పరిధిలోని 266 పంచాయతీలకు, రెండో విడతలో బాన్సువాడ డివిజన్‌లోని 11 మండలాలతో పాటు గాంధారి మండలానికి కలిపి 266 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై అభ్యర్థులు ఎలాంటి రాతలు రాయొద్దన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రూ.4 లక్షల వరకు, ఎంపీటీసీలు రూ లక్షన్నర రూపాయల వరకు, ఐదు వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసేవారు రూ. 2.50 లక్షలు, ఐదు వేలలోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. ఐదు వేల జనాభా పైన ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.50 వేలు, ఐదు వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.30 వేలు ఖర్చు చేసుకోవచ్చన్నారు.
నిరంతరం వాహనాల తనిఖీలుంటాయి
ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఇంటిగ్రెటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే 613 పోలింగ్ లొకేషన్లు, అలాగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే 605 పోలింగ్ లొకేషన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో నలుగురి వద్ద ఆయుధాలు ఉన్నాయని, ఎన్నికల నేపథ్యంలో వాటిని డిపాజిట్ చేసుకుంటామని పేర్కొన్నారు. 197 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డీపీవో మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.