జెడ్పీ పీఠంపై కన్ను! | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠంపై కన్ను!

Oct 1 2025 10:09 AM | Updated on Oct 1 2025 10:09 AM

జెడ్ప

జెడ్పీ పీఠంపై కన్ను!

బీఆర్‌ఎస్‌ నుంచి మళ్లీ దఫేదార్‌కే!?

కాంగ్రెస్‌లో తెరపైకి ‘ఏనుగు’ పేరు

జెడ్పీటీసీగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్న అనుచరులు

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దఫేదార్‌ శోభ

బీఆర్‌ఎస్‌కు మెజారిటీ వస్తే చైర్‌పర్సన్‌ అయ్యే అవకాశం!

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఆశావహులు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా జెడ్పీ పీఠంపై చర్చ సాగుతోంది. అధికార పార్టీనుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి జెడ్పీటీసీగా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ నాయకురాలు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలవడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా పలువురు నేతల దృష్టి జెడ్పీ పీఠంపై ఉంది. జెడ్పీటీసీగా గెలిచి జిల్లాపరిషత్‌ చైర్మన్‌ కావాలని పలువురు ఆశించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం మీద కన్నేసిన పలువురు నేతలు.. వీలైతే తాము లేకపోతే కుటుంబ సభ్యులను బరిలో నిలపాలని భావించారు. అయితే జెడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్‌ అనుకూలంగా వచ్చినా.. తమ మండల జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్‌ కలిసి రాకపోవడంతో చాలామంది నిరాశకు గురయ్యారు. పలువురు నేతలు ఇక రాజకీయాలు వద్దనే పరిస్థితికి చేరుకున్నారు.

కోర్టు తీర్పు వచ్చాకే..

బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఈనెల 8 తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు వేచిచూసే ధోరణిలో ఆశావహులు ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చినా.. ఇప్పుడే తొందరపడి జేబులు ఖాళీ చేసుకోవడం ఎందుకన్న ఆలోచనలో పలువురు ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వచ్చాక రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

బీఆర్‌ఎస్‌కు చెందిన దఫేదార్‌ రాజు నిజామాబాద్‌ జెడ్పీ చైర్మన్‌గా 2014 నుంచి 2019 వరకు పనిచేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత 2019లో పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. కామారెడ్డి నూతన జిల్లా పరిషత్‌గా ఏర్పటైంది. 2019లో జరిగిన ఎన్నికలలో బీసీ మహిళకు అవకాశం రావడంతో దఫేదార్‌ రాజు భార్య శోభ బరిలో నిలిచారు. ఆ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కే ఆధిక్యం దక్కడంతో ఆమెకు చైర్‌పర్సన్‌ అవకాశం లభించింది. దఫేదార్‌ రాజు సొంత మండలం మహ్మద్‌నగర్‌ మళ్లీ బీసీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. దీంతో మరోసారి శోభ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీకి మెజారిటీ వస్తే శోభకు చైర్‌పర్సన్‌ అవకాశాలుంటాయని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.

కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం..

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌ అనుకూలంగా వచ్చిన నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికలలో గెలిచి పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్‌ గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిపై ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. చైర్మన్‌ పదవి జనరల్‌ కావడంతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఎల్లారెడ్డి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంగానే ఆయన రాజకీయాలు నడిపిస్తున్నారు. అయితే బాన్సువాడలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో అక్కడ కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో ఏనుగు రవీందర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌ స్థానంకోసం ప్రయత్నించాలని ఆయన అనుచర వర్గం కోరుతోంది. ఆయన సొంత మండలం తాడ్వాయి జెడ్పీటీసీ స్థానం జనరల్‌ కావడం ఆయనకు అనుకూలించే అంశం. అనుచరులు ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తుండడంతో రవీందర్‌రెడ్డి ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రవీందర్‌రెడ్డి లేదంటే ఆయన భార్య మంజులారెడ్డి బరిలో దిగుతారన్న ప్రచారం జోరందుకుంది.

జెడ్పీ పీఠంపై కన్ను!1
1/2

జెడ్పీ పీఠంపై కన్ను!

జెడ్పీ పీఠంపై కన్ను!2
2/2

జెడ్పీ పీఠంపై కన్ను!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement