
బడుగుల చేతికి పల్లె పాలన!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పల్లె పాలనలో బడుగులదే పైచేయిగా నిలువనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఎంతోమందికి అవకాశాలు దక్కనున్నాయి. జిల్లాలో 532 పంచాయతీలు ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి కనీసం 371 గ్రామాల్లో సర్పంచ్‌లుగా అవకాశం దక్కనుంది. ఇందులో 65 గిరిజన పంచాయతీల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల స్థానాలన్నీ గిరిజనులకే దక్కుతాయి. అలాగే ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా మరో 26 పంచాయతీల్లోనూ గిరిజనులే సర్పంచ్‌లు కానున్నారు. ఇందులో కనీసం 40 మంది గిరిజన మహిళలకు అవకాశం దక్కనుంది. బీసీలకు 201 సర్పంచ్ పదవులు రిజర్వ్ అయ్యాయి. ఇందులో 96 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి 79 పంచాయతీలు దక్కాయి. ఇందులో 35 చోట్ల మహిళలకు అవకాశం ఇచ్చారు.
జిల్లాలో 25 మండలాలు ఉండగా, జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీ పదవులు 17 బడుగులకు దక్కనున్నాయి. ఇందులో బీసీలకు 11 స్థానాలు కేటాయించగా, ఐదుచోట్ల బీసీ మహిళలు మాత్రమే పోటీ చేయనున్నారు. ఎస్సీలకు నాలుగు స్థానాలు ఇవ్వగా.. రెండుచోట్ల ఎస్సీ మహిళలకు అవకాశం దక్కింది. ఎస్టీలకు రెండు స్థానాలు కేటాయించగా.. ఒక స్థానంలో ఎస్టీ మహిళ పోటీ చేయనున్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాలు 233 ఉండగా.. ఇందులో బీసీలకు 98, ఎస్సీలకు 40, ఎస్టీలకు 20 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
201 పంచాయతీల్లో
బీసీలకు రిజర్వేషన్ అనుకూలం
91 సర్పంచ్ స్థానాలు గిరిజనులకు..
79 సర్పంచ్ పదవులు
ఎస్సీలకు రిజర్వ్