
ప్రయాణం భారం..
అవస్థలు పడుతున్నాం
నడవాల్సి వస్తోంది..
● బస్సులు నడవక ఇబ్బందులు
● కామారెడ్డి, ఎల్లారెడ్డికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిందే
● పండుగల పూట ప్రయాణికులకు అవస్థలు
లింగంపేట(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో నెల రోజులుగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆగస్టు 27 నుంచి దాదాపు నెల రోజులకుపైగా కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగంపేట మండలం లక్ష్మాపూర్, అడ్విలింగాల వద్ద రోడ్డు కొట్టుకుపోయాయి. నాగిరెడ్డిపేట మీదుగా మెదక్, హైదరాబాద్ వెళ్లేదారిలో పోచారం ప్రాజెక్టు కింద వంతెనకు ఇరువైపులా రోడ్డు దెబ్బతిన్నది. దీంతో వారం, పది రోజులు రాకపోకలు నిలిచి ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం స్పందించి తాత్కాలికంగా మొరం వేసి రోడ్లు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించారు. లింగంపేట మండలం లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెన, రోడ్డు కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌కు ప్రతి రోజు నడిచే బస్సులను అధికారులు నిలిపివేశారు. సుమారు నెల పది రోజులు అవుతున్నా బస్సులు నడపడంలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి నుంచి గాంధారి, నల్లమడుగు మీదుగా లింగంపేట, ఎల్లారెడ్డి మీదుగా పిట్లంకు మూడు బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సుల్లో వెళ్లాలంటే 30 కిలోమీటర్ల మేర దూరం, ఆర్థిక భారం పెరుగుతుంది. కామారెడ్డి నుంచి లింగంపేట మండలం పొల్కంపేట చౌరస్తా వరకు బస్సులు నడుపుతున్నారు. అక్కడి నుంచి ప్రయాణికులు మూడు కిలోమీటర్ల మేర ఆటోల్లో వెళ్లాల్సి వస్తుంది. ఇదే అదనుగా ప్రైవేటు వాహనాల్లో రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఆర్థిక భారం, దూరం, సమయం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు చొరవ చూపి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. అయితే, రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు మరో 15 రోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు.
నెల రోజులుగా పొల్కంపేట వైపు బస్సులు రావడంలేదు. దీంతో లింగంపేటకు నడిచి వెళ్తున్నాం. ప్రై వేటు వాహనాల్లో చార్జీలు ఎక్కువ గా తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకులు, బట్టలు, పండుగ సామ న్ల కొనుగోలుకు లింగంపేట వెళ్లాల్సి ఉంటుంది. పాము ల వాగు వద్ద రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి.
– కంల్యానాయక్(ఒంటర్‌పల్లి)
పొల్కంపేట రూట్‌లో బస్సులు నడపకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం లింగంపేట, కామారెడ్డికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో మూడు, నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలంటే చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు.
–వస్రాం(సురాయిపల్లి తండా)

ప్రయాణం భారం..

ప్రయాణం భారం..