
తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలు
ఖలీల్‌వాడి: తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడే ముఠాకు చెందిన సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న నగరంలోని నాగారం బ్రాహ్మణకాలనీలోని పూజారి వేలేటి పవన్ శర్మ ఇంట్లో చొరబడిన దుండగులు సుమారు 33 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ. 30 వేల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని ధర్మపురిహిల్స్ డ్రైవర్స్‌కాలనీకి చెందిన షేక్‌సల్మాన్ అలియాస్ సోనూ, దొడ్డికొమురయ్య కాలనీకి చెందిన మరాఠి ఆకాశ్‌రావు నాగారంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల చౌరస్తా వద్ద ఆటోలోఅనుమానాస్పదంగా వెళుతుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. షేక్‌సల్మాన్ అలియాస్ సోనూ వద్ద 31 తులాల బంగారం, మరాఠి ఆకాశ్‌రావు వద్ద దొంగతనానికి ఉపయోగించిన ఆటో, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరినీ విచారించగా ఐదుగురు సభ్యులు కలిసి దొంగల ముఠా ఏర్పడిందని, ముఠాకు నాయకుడు షేక్ సాదక్ అని తెలిపారు. సాదక్‌కు గంజాయి అలవాటు ఉందని, దొంగతనాలకు స్కేచ్ వేస్తాడన్నారు. వినోద్ చౌహాన్, ముక్తే సాయినాథ్, షేక్ సాదక్ కలిసి దొంగతనాలు చేస్తారని, ముగ్గురిపై నగరంలోని పోలీస్‌స్టేషన్‌లలో దొంగతనాల కేసులు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. ఈ ముఠా జల్సాలకు అలవాటు పడి డబ్బు సరిపోక దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసును చేధించిన కానిస్టేబుళ్లను సీపీ అభినందించి, రివార్డ్ అందజేశారు. సమావేశంలో ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, నార్త్ సీఐ బూస శ్రీనివాస్, ఎస్సై గంగాధర్ పాల్గొన్నారు.
జల్సాలకు అలవాటు
పడిన దొంగల ముఠా
ముగ్గురు పరారీ, ఇద్దరు అరెస్ట్
31 తులాల బంగారం స్వాధీనం
వివరాలు వెల్లడించిన
సీపీ సాయిచైతన్య

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలు