
భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
● అధికారులకు కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం
● ఎడపల్లి తహసీల్, ఎంపీడీవో
కార్యాలయాల తనిఖీ
బోధన్: భూ భారతి (రెవెన్యూ) సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా పర్యవేక్షించాలని తెలిపారు. ఎడపల్లి తహసీల్, ఎంపీడీవో కార్యాలయాలను సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ దత్తాద్రి, ఉద్యోగులతో సమావేశమై దరఖాస్తులపై గ్రామాల వారీగా సమీక్షించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపడుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గడువులోపు ఎస్‌ఐఆర్‌ను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అంతకుముందు ఎంపీడీవో ఆఫీస్‌ను సందర్శించి అధికారులు, ఉద్యోగులతో మండలంలోని కొనసాగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ఆరా తీశారు. లబ్ధిదారులందరూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇప్పటికే పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.