
వీడని ముసురు
జిల్లాలోని పలు ప్రాంతాలలో రికార్డయిన వర్షపాతం వివరాలు..
నిజాంసాగర్‌లోకి భారీ వరద
● మూడు రోజులుగా జల్లులు
● అక్కడక్కడ భారీ వర్షాలు
● దెబ్బతింటున్న పంటలు
● ఇన్‌ఫ్లో 1.30 లక్షల క్యూసెక్కులు
● అవుట్‌ఫ్లో 1.51 లక్షల క్యూసెక్కులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అల్పపీడనం ప్రభావంతో ఆదివారం సైతం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మూడు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో ముసురు పెట్టింది. కొన్నిచోట్ల జల్లులు, ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో వాగుల్లో ప్రవాహం మరింత పెరిగింది. చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తడంతో అలుగులు పారుతున్నాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని వివిధ వాగుల్లోనూ వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. పోచారం, కౌలాస్‌నాలా, నిజాంసాగర్ ప్రాజెక్టులలోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లా అంతటా వర్షం కురిసింది.
కామారెడ్డి చెరువులోకి భారీగా నీరు..
జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువుకు భారీగా వరద వస్తోంది. ఎగువన కృష్ణాజీవాడి, లింగాపూర్‌లలో శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో చెరువుకు వరద పెరిగి అలుగు ఉధృతంగా పారుతోంది. గత నెలాఖరులో చెరువు అలుగు ప్రవాహం పెరిగి, వరదతో జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిన విషయం తెలిసిందే.
నిజాంసాగర్: ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు, హల్దీవాగు, ఘనపురం ఆనకట్టతో పాటు పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతుండడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. ఆదివారం సాయంత్రం ప్రాజెక్టులోకి 1.30 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 21 వరద గేట్లను ఎత్తి 1.51 లక్షల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రధాన కాలువకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,401.40 అడుగుల (12.954 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
సింగూర్‌లోకి..
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయానికి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 10 వరద గేట్లను ఎత్తి 96,604 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు.
కౌలాస్‌లోకి 6,285 క్యూసెక్కులు..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6,285 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. ఆదివారం సాయంత్రానికి 457.60 మీటర్ల (1.141 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
మంజీరలో వరద ఉధృతి..
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1.40 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో పాటు నల్లవాగు, సింగితం, కల్యాణి ప్రాజెక్టుల వరద నీరు కూడా నదిని చేరుతోంది. దీంతో మంజీర 2 లక్షల క్యూసెక్కుల నీటితో ప్రవహిస్తోంది. నది పరీవాహన ప్రాంతంలోని పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
లొకేషన్ వర్షపాతం
(మి.మీ.)
అర్గొండ 74.0
నస్రుల్లాబాద్ 57.3
బొమ్మన్‌దేవ్‌పల్లి 53.8
జుక్కల్ 43.0
కొల్లూర్ 41.8
కలెక్టరేట్ 39.8
దోమకొండ 39.8
తాడ్వాయి 36.3
రామారెడ్డి 36.0
ఇసాయిపేట 31.5
పుల్కల్ 31.5
బీర్కూర్ 30.0