
సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టాలి
● ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్
● మద్నూర్‌లో ఘనంగా సంఘ్ శతాబ్ది ఉత్సవాలు
మద్నూర్: భారతదేశపు ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా శివకుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గురు ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు ఐదు వందల మంది స్వయం సేవకులు మండల కేంద్రంలోని ప్రధాన వీధులలో పథ సంచలన్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925లో విజయదశమి రోజున హెడ్గేవార్ స్థాపించారన్నారు. ప్రస్తుతం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడని, ఎవరినీ తక్కువ చేసి చూడవద్దని పేర్కొన్నారు. హిందుత్వంలో అంటరానితనం లేదని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ పాటించే పంచ పరివర్తన్‌లో మొదటిది సమరసత అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోందని, విపత్కర పరిస్థితులలో పునర్నిర్మాణ కార్యక్రమాల్లోనూ సేవలందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిదులు హన్మండ్లు, నరేష్, నాందేవ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టాలి