
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
బాన్సువాడ : మహిళను బెదిరించి బంగారం, నగదు దొంగలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెల్గాపూర్ గ్రామానికి చెందిన మేడిపల్లి లక్ష్మిని ఈనెల 19న కొండాపూర్‌కు చెందిన నీరడి సాయిలు బాన్సువాడలోని పోచమ్మ గల్లీకి పిలిపించి ఆమె వద్ద ఉన్న రూ.50 వేల నగదు, అరతులం బంగారు హారం, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. బాధితురాలు బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీలను పరిశీలించి నీరడి సాయిలును తాడ్కోల్ చౌరస్తా వద్ద పట్టుకున్నారు. దొంగలించిన బంగారాన్ని బుర్ర వెంకటరమణకు అమ్మినట్లు నిందితుడు అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. వెంకటరమణ వద్ద 11 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నీరడి సాయిలు, బుర్ర వెంకటరమణలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సాయిలుపై గతంలో బాన్సువాడ, లింగంపేట్, నిజాంసాగర్, అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన సీఐ అశోక్, సిబ్బందిని ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు.