
సమష్టి కృషితో శతశాతం ఫలితాలు
మాచారెడ్డి : ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషితో ఉమ్మడి మాచారెడ్డి మండలంలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రత్యేక తరగతులు, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వెరసి 517 మంది విద్యార్థులకు గాను 512 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఒక కస్తూర్బా, మరో ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో వందశాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో మాచారెడ్డి ఉన్నత పాఠశాలకు చెందిన సబా తబస్సుం అనే విద్యార్థిని 581 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. ఇసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వైష్ణవి 578 మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది. అదే పాఠశాలకు చెందిన నిఖిత 575 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. 14 ఉన్నత పాఠశాలలకు గాను 11 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం ప్రత్యేక తరగతులతో ఉత్తీర్ణత సాధించినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.
విద్యార్థులను ప్రోత్సహించాం
ప్రతి రోజూ పాఠశాలకు హాజరుకావాలని విద్యార్థులను ఎల్లవేళలా ప్రోత్సహించాం. నెలలో 30 రోజులు హాజరైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేశాం. అలాగే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి శ్రద్ధతో చదివేట్టు కృషి చేశాం. దీంతో విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.
– దేవేందర్‌రావు, ఎంఈవో, మాచారెడ్డి
ఉమ్మడి మాచారెడ్డి మండలంలో 11
పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత
పది ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులు