
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి
కామారెడ్డి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో నిరుపేదైన కుంట్ల వినోదకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయగా, శుక్రవారం కలెక్టర్ భూమిపూజ చేసి ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరైన ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రభుత్వం నుంచి లబ్ది పొందాలని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు 708 ఇళ్లు మంజూరు కాగా, 74 ఇళ్లకు మార్క్ అవుట్ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో 11,153 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో కామారెడ్డి నియోజక వర్గంలో 3206, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 3496, జుక్కల్ నియోజక వర్గంలో 3019, బాన్సువాడ నియోజక వర్గంలో 1432 ఇళ్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఇందులో 2250 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాగా పనులు పలు దశల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రతీ సోమవారం ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా విడతల వారీగా నిధులు చెల్లిస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్‌పాల్ రెడ్డి, గ్రామస్తులు కొమిరెడ్డి పెద్దనారాయణ, చిట్టబోయిన ప్రభాకర్ పాల్గొన్నారు.
లబ్ధిదారులకు కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్ సూచన
మంజూరు పత్రాల అందజేత