
పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● జిల్లాకేంద్రంలో పర్యటన
కామారెడ్డి టౌన్: పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, దోమల వ్యాప్తి అరికట్టేందుకు ఫాగింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని అశోక్ నగర్, స్నేహపురి కాలనీ, తదితర వార్డుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఎలాంటి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా శానిటేషన్ కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలని తెలిపారు.
సాక్షి కథనానికి స్పందన..
వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఈనెల 21న సాక్షిలో ప్రచురితమైన ‘ముంచుకోస్తుంది వానాకాలం.. ముంపు సమస్యకేదీ పరిష్కారం’ కథనానికి కలెక్టర్ స్పందించారు. పలు వార్డులో పర్యటించిన అనంతరం వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. వార్డు ఇన్‌చార్జిలు ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ కార్యక్రమాలు పరిశీలించాలని, అధికారులు కూడా పర్యవేక్షించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, సహాయ ఇంజనీరు శంకర్ తదితరులు పాల్గొన్నారు.