
పర్మళ్ల తండాలో వివాహిత అదృశ్యం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల తండాకు చెందిన బాదావత్ వసంత అదృశ్యమైనట్లు ఎస్సై రాఘవేంద్ర గురువారం తెలిపారు. తాడ్వాయి మండలం గుండారం పంచాయతీ పరిధిలోని హత్‌గుండు తండాకు చెందిన వసంతకు పర్మళ్ల తండాకు చెందిన బాదావత్ ప్రకాశ్‌తో ఈ నెల 4న వివాహం జరిగింది. ప్రకాశ్‌తో ఉండడం ఇష్టంలేదని వసంత తరుచూ చెప్పినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలిపారు. భర్త ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
బాలుడిపై కుక్కల దాడి
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రం ఎల్లమ్మ కుచ్చలో గురువారం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు రాంచదర్‌పై కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. మూడు కుక్కలు ఒకేసారి వెంటపడి దాడి చేయగా ముఖానికి, చేతికి గాయాలు అయ్యాయి. బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో కేకలు వేయగా తల్లిదండ్రులు బయటకు వచ్చి కుక్కలను తరిమి కొట్టడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.