కాచాపూర్ గ్రామ సమస్యలు పరిష్కరించాలి
భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామానికి చెందిన పలువురు యువకులు అధికారులను కోరారు. బుధవారం తహసీల్దార్ శివప్రసాద్ తో పాటు ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో సిమెంటు రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, ఇరిగేషన్ ప్రధాన కాలువ పిచ్చి మొక్కలతో నిండి పోయిందని, తాగునీటి లీకేజీలు అధికంగా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎంఎస్‌ఎన్ కంపెనీ ద్వారా దుర్వాసన గ్రామంలోకి వస్తుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల కమిటీ చైర్మన్ మహిపాల్, జిల్లా వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింలు, గ్రామ బీజేపీ అధ్యక్షులు అనిల్, మండల బీజేపీ ఉపాధ్యక్షులు శంకర్, బీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ సేవా సమితి సభ్యులు మోహన్ గౌడ్, నవీన్ చారి స్వామి ఉన్నారు.


