ఎంపీ వ్యవహారశైలిపై గుర్రు
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యవహార శైలిపై జనసేనలోని ఓ వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో ఎంపీ అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తనకు పెత్తనం వచ్చాక, పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్న నేతలను పక్కన పెట్టి, సొంత వర్గాన్ని మాత్రమే ప్రోత్సహించడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ పదవుల భర్తీలో సైతం తన వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. తాము ఏం చేసినా ఎంపీ చూసుకుంటారనే ధోరణితో ఆయన రెచ్చిపోతోందంటూ మరో వర్గం మండిపడుతోంది. ఈ పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయోనని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాల అగ్గి రాజుకుంటోంది. జెండా మోసి పార్టీ కోసం శ్రమించిన తమను కాదని కొత్తగా వచ్చిన వారికి అందలం ఎక్కించడంపై అందలం ఎక్కించడంపై నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఫైవ్‌మెన్ కమిటీ సైతం తమ వర్గాలను ప్రోత్సహించే పనిలో పడటంతో.. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు, ఐదు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో, తమ సమస్యలన్నీ తీరిపోతాయని పిఠాపురం ప్రజలు భావించారు. అయితే, అసలు కథ అప్పుడే మొదలైంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ నియోజకవర్గానికి అప్పుడప్పుడు చుట్టపుచూపుగా మాత్రమే వచ్చి వెళ్లడం మొదలు పెట్టారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసుకునేందుకు తొలుత మర్రెడ్డి శ్రీనివాస్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన పని తీరు నచ్చకపోవడంతో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిశోర్‌లతో ఫైవ్‌మెన్ కమిటీ ఏర్పాటు చేశారు.
పవన్ వద్దకు పంచాయితీ?
ఈ విభేదాల నేపథ్యంలో ఫైవ్‌మెన్ కమిటీతో పవన్ భేటీ అయ్యారు. పదవులు, సొంత వ్యాపకాలే తప్ప పార్టీని పట్టించుకోరా అంటూ సభ్యులపై మండిపడినట్లు సమాచారం అంతటితో ఆగకుండా బహిరంగ సభలో సైతం కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రసంగించడం చర్చకు దారి తీసింది. తన పర్యటన ముగిసిన వెంటనే యు.కొత్తపల్లి మండలానికి చెందిన అక్షయ్, నిఖిల్ వర్గాలను జనసేన ప్రధాన కార్యాలయానికి పిలిపించి, సయోధ్య కుదిర్చారు. వెంటనే మండలానికి వెళ్లి ఇరు వర్గాలూ ఐక్యంగా మీడియా సమావేశం పెట్టాలని సలహా ఇచ్చారు. ఆయన ఆదేశాలతో ఇటీవల రెండు వర్గాల నేతలు కలిసి కొత్తపల్లిలోని ఓ కల్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడే మరో వర్గం నాయకులు లేచి రచ్చ లేపారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌పై విమర్శలు చేశారు. పార్టీ సమావేశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆగ్రహం పట్టలేక ఏకంగా కుర్చీలు సైతం విసిరేశారు. ఒకరిని ఒకరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వారందరూ జనసేన గ్రామ కమిటీ, బూత్ కన్వీనర్లే కావడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఈ వివాదాన్ని చక్కదిద్దలేక ఫైవ్‌మెన్ కమిటీ చేతులెత్తేసింది. ఈ రచ్చ కాస్తా పవన్ వద్దకు చేరింది. ఈ వ్యవహారం ఆయనకు సైతం తలనొప్పిగా మారినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫైవ్‌మెన్ కమిటీ రద్దుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కమిటీ స్థానంలో మరో ఇన్‌చార్జిని నియమించే అవకాశం ఉందన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడి మాటనే లెక్క చేయని నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఉత్కంఠ మొదలైంది.
కొరవడిన సమన్వయం
పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను చక్కదిద్దాల్సిన ఫైవ్‌మెన్ కమిటీలోనే సమన్వయం కరువైంది. ఇందులోని ఐదుగురు సభ్యుల్లో ఎవరికి వారు తమతమ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పదవుల్లో వారికే పెద్దపీట వేయడం మొదలుపెట్టారు. ఆది నుంచీ పార్టీలో ఉన్నవారికి ఈ పరిణామం మింగుడు పడని అంశంగా మారింది. ఇటీవల పవన్ పిఠాపురం పర్యటన నేపథ్యంలో వర్గపోరు ఒక్కసారిగా తారస్థాయికి చేరింది. పవన్ పర్యటనకు ముందు రోజే యు.కొత్తపల్లి మండలంలో జనసేన నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఆయన ముఖ్య అనుచరుడైన రావు అక్షయపై వేగిశెట్టి నిఖిల్ వర్గం మండిపడింది. పథకాలన్నీ అక్షయ్ వర్గానికే కట్టబెడుతున్నారని, పార్టీలో సీనియర్లను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
జనసేనలో భగ్గుమంటున్న విభేదాలు
పిఠాపురంలో వర్గాలుగా
విడిపోయిన నేతలు
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్,
అనుచరుల వ్యవహార శైలిపై గుర్రు
పార్టీ కోసం కష్టపడిన వారిని
పక్కన పెడుతున్నారని ఆగ్రహం
కొత్తవాళ్లను అందలం ఎక్కించడంపై
రగిలిపోతున్న కార్యకర్తలు
చేతులెత్తేసిన ఫైవ్‌మెన్ కమిటీ


