రబీలో ఎండిపోనున్న ఆశలు! | - | Sakshi
Sakshi News home page

రబీలో ఎండిపోనున్న ఆశలు!

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

● పొంచి ఉన్న నీటి ఎద్దడి ముప్పు

● సాగునీటి ప్రణాళికలో లోపం

● గోదావరిలో తగ్గుతున్న ఇన్‌ఫ్లో

● ఇప్పటికీ ఫ్లషింగ్‌ ఆపరేషన్‌ లేదు

● గతంలో 50–60 వేల క్యూసెక్కుల

ప్రవాహంలో 48 గంటల పాటు

పూడిక తొలగింపు

● గత కొన్నేళ్లుగా 6 గంటలకే పరిమితం

సాక్షి, అమలాపురం: రాష్ట్ర ధాన్యాగారానికి ఆయువు పట్టుగా నిలిచిన గోదావరి డెల్టాను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. లక్షలాది ఎకరాలకు సాగునీరందించే ధవళేశ్వరం బ్యారేజ్‌ నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం డెల్టా ఆయకట్టు రైతులకు శాపంగా మారుతోంది. రబీ సాగుకు నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉన్న తరుణంలో బ్యారేజ్‌ పాండ్‌లో పేరుకుపోయిన ఇసుక, ఒండ్రు మట్టి, బురదను తొలగించేందుకు ఫ్లషింగ్‌ ఆపరేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నామమాత్రం చేసింది. ఈ ఏడాది ఇన్‌ఫ్లో పడిపోతున్నా ఆపరేషన్‌ ఊసే లేకుండా అధికారులు వ్యవహరిస్తుండడంతో వచ్చే రబీలో రైతుల నీటి ఎద్దడి కష్టాలు రెట్టింపు కానున్నాయి.

ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద గతంలో 50 వేల నుంచి 60 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడే 48 గంటల పాటు ఏకధాటిగా ఫ్లషింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించేవారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల స్కవర్‌ స్లూయిజ్‌ల ద్వారా ఒకేసారి వేగంగా నీరు వదలడంతో మట్టి, ఒండ్రు, ఇసుక కొట్టుకుపోయేవి. దీనివల్ల బ్యారేజ్‌ వద్ద పూడిక తొలగిపోవడంతో పాటు బ్యారేజ్‌ నుంచి ప్రధాన పంట కాలువలకు నీరు వెళ్లేందుకు అప్రోచ్‌ ఛానల్‌ (బ్యారేజ్‌లో ఉండే కాలువ) వద్ద పూడిక మొత్తం తొలగిపోయేది. వరదల సమయంలో వేసిన మేటలు కూడా కొట్టుకుపోయేవి. ఇంత కీలకమైన ఈ ఆపరేషన్‌ వ్యవధిని 6 గంటలకే కుదించేశారు. ఫలితంగా పూడిక తొలగింపు పూర్తిస్థాయిలో జరగడం లేదు.

పూడికతో తగ్గుతున్న నిల్వ సామర్థ్యం

ధవళేశ్వరం బ్యారేజ్‌ పాండ్‌లో గతంలో 2.93 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉండగా, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం అది 1.90 టీఎంసీలకు పడిపోయినట్టు అంచనా. అంటే సుమారు ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఒక టీఎంసీ నీటితో దాదాపు 10,800 ఎకరాల వరి పంటకు నీరందించవచ్చు. రబీ సమయంలో అదనంగా ఒక టీఎంసీ నీరు అందుబాటులో ఉండటం కూడా రైతులకు ఎంతో ప్రయోజనకరం.

10.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు ముప్పు

గోదావరి డెల్టా పరిధిలో సుమారు 10.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో వరి సాగు 8.96 లక్షల ఎకరాలు కాగా, వాస్తవంగా సాగయ్యే విస్తీర్ణం సుమారు 7.50 లక్షల ఎకరాలుగా అంచనా. ఖరీఫ్‌లో సుమారు 18 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీలో 28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. వీటితో పాటు కొబ్బరి వంటి ఉద్యాన పంటలు, ఆక్వా చెరువులకు కూడా గోదావరి నీరే ఆధారం. ఇంతటి విస్తృత ఆయకట్టుకు నీరందించే ధవళేశ్వరం బ్యారేజ్‌ నిర్వహణను నిర్లక్ష్యం చేయడం తమ భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని రైతులు వాపోతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, రబీకి గోదావరి నుంచి వచ్చే నీరు పరిమితమైతే ప్రతి నీటి చుక్కా కీలకంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో బ్యారేజ్‌ పాండ్‌లో పేరుకుపోయిన పూడిక తొలగించకపోవడంపై ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. దీనిపై ఇరిగేషన్‌ అధికారుల నుంచి స్పందన ఎలాంటి స్పందనా లేదు.

ఇప్పుడు చేసినా.. మమ అనిపించడమే..

ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద సర్‌ప్లస్‌ కనీసం 30 వేల క్యూసెక్కులకు పైగా ఉన్న సమయంలో ఫ్లషింగ్‌ ఆపరేషన్‌ చేయాలి. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 29,401 క్యూసెక్కులకు పడిపోగా, పంట కాలువలకు 14,400 క్యూసెక్కులు, సర్‌ప్లస్‌గా 15,001 క్యూసెక్కులు మాత్రమే దిగువకు వదులుతున్నారు. ఈ సమయంలో ఫ్లషింగ్‌ ఆపరేషన్‌ చేసినా ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చేసినా మమ అనిపించడమేనని అంటున్నారు. ఎందుకంటే.. నీటి ప్రవాహం తగ్గినప్పుడు, కేవలం ఆరు గంటల పాటు స్లూయిజ్‌లు తెరిచి ఉంచడం వల్ల ఇసుక మేటలు పూర్తిగా కొట్టుకుపోవడం కష్టమవుతుందని చెబుతున్నారు. దీంతో బ్యారేజ్‌ పాండ్‌లో పూడిక అలాగే పేరుకుపోయి, నీటి నిల్వ సామర్థ్యం మరింత తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇప్పుడు చేసినా ప్రయోజనం లేదు

ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద ఫ్లషింగ్‌ ఆపరేషన్‌ కీలకం. రబీకి ముందు సరైన పద్ధతిలో చేయకపోతే పంట కాలువల ద్వారా శివారు, మెరక ప్రాంతాలకు నీరందదు. సర్‌ప్లస్‌ కనిష్టంగా 25 వేలు ఉన్నప్పుడైనా చేయాలి. ఇప్పుడు ఇన్‌ఫ్లో లేనందున చేసినా ప్రయోజనం లేదు. ఇది ముమ్మాటికీ నిర్లక్ష్యమే.

– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ మాజీ చైర్మన్‌, ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ రిటైర్డ్‌ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement