పిఠాపురం: ఓటు హక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యాన స్థానిక ఉప్పాడ బస్టాండ్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపడుతున్న ఉద్యమాలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాజ్‌కుమార్, మండల కన్వీనర్ కె.చిన్న, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరిట దేశవ్యాప్తంగా 13.30 కోట్ల మంది ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర పరిశీలన జరిపి, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, న్యాయవాదులు, ప్రజాసంఘాలు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, ఆందోళనకారులపై అణచివేత చర్యలు చేపట్టడం సరికాదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, రజక వృత్తిదారుల, భవన నిర్మాణ కార్మిక, రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


