వారికే పురపీఠాధిపత్యం | - | Sakshi
Sakshi News home page

వారికే పురపీఠాధిపత్యం

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుర పోరుకు తొలి అడుగు పడింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ఘట్టమైన మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలోని కాకినాడ నగర పాలక సంస్థలో మేయర్‌తో పాటు పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మున్సిపాలిటీలు, ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీల చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. దీని తరువాత వార్డు రిజర్వేషన్లు కూడా ఖరారై, నోటిఫికేషన్‌ వెలువరిస్తే ‘పుర’ సంగ్రామం ప్రారంభం కానుంది. రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా పట్టణాల్లో రాజకీయ వేడి మొదలైంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థుల వేటలో పడ్డారు. మరోవైపు రాజకీయ పార్టీల నేతల ఊహలకు అందని విధంగా రిజర్వేషన్లు ఖరారు కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఒకటనుకుంటే.. మరొకటి అయ్యిందంటూ పలువురు నిట్టూరుస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ఆయా పట్టణ స్థానిక సంస్థల నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వైఎస్సార్‌ సీపీ రంగం సిద్ధం చేస్తోంది. కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.

‘ఆమె’కే కాకినాడ

కాకినాడ మేయర్‌ పీఠంపై గత కొన్ని రోజులుగా ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి తమకంటే తమకంటూ టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ పడ్డాయి. ఎట్టకేలకు జనసేనకు ఖరారైందంటూ తాజాగా ప్రకటనలు సైతం వెలువడ్డాయి. రిజర్వేషన్‌ తమకు అనుకూలంగా ఉంటుందని ఎవరికి వారే భావించారు.

కానీ, వారి అంచనాలకు భిన్నంగా కాకినాడ మేయర్‌ స్థానాన్ని బీసీ–మహిళకు కేటాయించారు. దీంతో, టీడీపీ, జనసేన, బీజేపీల్లో స్తబ్దత నెలకొంది. బీసీ మహిళా నేతను వెతికే పనిలో ఆయా పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో కార్పొరేషన్‌ పీఠాన్ని టీడీపీ కై వసం చేసుకుంది. తమకు అనుకూలమైన రిజర్వేషన్‌ వస్తుందని భావించిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులు ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు.

ఏలేశ్వరంలో

ముచ్చటగా మూడోసారి..

ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ పదవిని గతంలో బీసీ–మహిళకు కేటాయించగా.. ప్రస్తు తం ఎస్సీ–మహిళకు కేటాయించారు. దీంతో, వ రుసగా మూడుసార్లూ మహిళలకే ఈ పదవి దక్కే చాన్స్‌ లభించినట్లయ్యింది. నగర పంచాయతీలో 20 వార్డులుండగా.. గత ఎన్నికల్లో 16 వైఎస్సార్‌ సీపీ, 4 టీడీపీ కై వసం చేసుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కుట్రలకు తెర తీసి, ఆరుగురు సభ్యులను ప్రలోభాలకు గురి చేసి, చైర్‌పర్సన్‌ పదవిని బలవంతంగా లాక్కున్నారు.

గొల్లప్రోలు

గొల్లప్రోలు చైర్మన్‌ పదవిని బీసీ–జనరల్‌ నుంచి అన్‌ రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. మొత్తం 20 వార్డులకు గాను గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 18 చోట్ల విజయఢంకా మోగించింది. టీడీపీ రెండు వార్డులకే పరిమితమైంది. ప్రస్తుతం అదే విజయోత్సాహంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.

బీసీ–మహిళకు తుని

తుని మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానాన్ని గతంలో ఓసీ మహిళకు రిజర్వు చేయగా.. వైఎస్సార్‌ సీపీ బీసీ మహిళకు అవకాశం ఇచ్చింది. ఈసారి ఈ స్థానాన్ని బీసీ–మహిళకే కేటాయించారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో తునిలోని 30కి 30 వార్డుల్లోనూ వైఎస్సార్‌ సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్‌ పీఠంపై కుట్రలు ప్రాంభించింది. ఒక్క కౌన్సిలర్‌ బలం లేకపోయినా.. ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేసి చైర్మన్‌ పీఠాన్ని లాగేసుకుంది. ప్రస్తుతం రిజర్వేషన్లు ఖరారు చేయడంతో చైర్మన్‌ అభ్యర్థిని వెతికే పనిలో పడ్డాయి. వైఎస్సార్‌ సీపీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది.

పిఠాపురం.. ఎస్సీ జనరల్‌కు

పిఠాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని గతంలో ఓసీ–మహిళకు కట్టబెట్టగా.. ప్రస్తుతం ఎస్సీ–జనరల్‌కు కేటాయించారు. కూటమిలోని జనసేన, టీడీపీల నుంచి చైర్మన్‌ రేసులో ముగ్గురు డాక్టర్లు పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు పార్టీల మధ్య వర్గపోరు నడుస్తూండటంతో మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. పిఠాపురం మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను గతంలో జరిగిన ఎన్నికల్లో 26 చోట్ల వైఎస్సార్‌ సీపీ విజయకేతనం ఎగురవేసింది. త్వరలో జరిగే ఎన్నికల్లో సైతం విజయం సాధించేందుకు సిద్ధమవుతోంది.

మున్సిపల్‌ ఎన్నికలకు తొలి అడుగు

మేయర్‌, చైర్మన్‌ పదవులకు

రిజర్వేషన్ల ఖరారు

బీసీ–మహిళకు కాకినాడ మేయర్‌ పీఠం

మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల వేటలో పార్టీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement