● విచ్చలవిడిగా కూటమి నేతల
మట్టి తవ్వకాలు
● టేకి డ్రెయిన్ గట్టును ఆనుకుని యథేచ్ఛగా గోతులు
● లే అవుట్లకు తరలింపు
కాజులూరు: మండలంలోని పల్లిపాలెంలో అధికార కూటమి నాయకులు టేకి డ్రెయిన్ గట్టును ఆనుకుని ఉన్న మట్టి దిమ్మలను విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. వాస్తవానికి పొలాల్లో ట్రక్కు మట్టి తీయాలన్నా రెవెన్యూ, గనుల శాఖ అనుమతులుండాలి. కానీ, అటువంటి అనుమతులేవీ లేకుండా అక్రమంగా మట్టి తవ్వేసి, తరలించుకుపోతున్నారు. దీనిపై ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. దీనిపై సంబంధిత వీఆర్‌ఓలు జె.రాధాకృష్ణ, కె.సత్యనారాయణలను వివరణ కోరగా.. టేకి డ్రెయిన్‌లో పూడికల తొలగింపునకు నీటి పారుదల శాఖ అధికారులు 2021లో డ్రెడ్జింగ్ చేశారని చెప్పారు. ఆ సందర్భంగా తొలగించిన ఇసుక, మట్టిని గట్టును ఆనుకుని ఉన్న పట్టా భూముల్లో వేశారని అన్నారు. ఆ భూముల పట్టాదారుల కోరిక మేరకే అధికార పార్టీ నాయకులు ఆ మట్టిని తొలగిస్తున్నారని చెప్పారు. అయితే, పట్టా భూమిలో మెరక తొలగించే వంకతో కూటమి నాయకులు పొలంలో మట్టిని ఇష్టానుసారం తవ్వేసి, పొరుగున ఉన్న యానాంతో పాటు రామచంద్రపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లోని లే అవుట్లకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ రూ.35 లక్షల మేర మట్టి అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. కొంత మంది అధికారులు కాసులకు కక్కుర్తిపడి, మట్టి అక్రమ తవ్వకాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీలతో మట్టి రవాణా జోరుగా సాగిస్తూండటంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఈ వాహనాల ధాటికి పలుచోట్ల రోడ్లపై తిరిగే చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియాకు వెంటనే కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టేకి డ్రెయిన్ గట్టుకు మట్టి అక్రమార్కులు తూట్లు పొడిచారిలా..


