బీసీలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుటిల రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

బీసీలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుటిల రాజకీయాలు

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

కాకినాడ రూరల్‌: రాష్ట్రంలో బీసీలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుటిల రాజకీయానికి తెర తీశారని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. ఒక చేత్తో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అని ప్రకటిస్తూ, మరోవైపు ప్రతాప్‌రెడ్డి లాంటి వారితో కోర్టుల్లో కేసులు వేయించడమే చంద్రబాబు కుటిల రాజకీయానికి తార్కాణమని ధ్వజమెత్తారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీల పట్ల చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ గతంలో చంద్రబాబు అవమానించారని గుర్తు చేశారు. వాస్తవానికి బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 139 బీసీ ఉప కులాలకు 58 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతికి నాంది పలికారని చెప్పారు. నామినేటెడ్‌ పదవులు మొదలు, కాంట్రాక్టులు, చట్ట సభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించి, సామాజిక న్యాయం చేసింది ఒక్క జగన్‌ మాత్రమేనని అన్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు రూ.4 లక్షల కోట్లకు పైగా చేయూతనందించిన ఘనత ఆయనదేనన్నారు. సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా వంటి పథకాలను బీసీలకు అందించారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మొదలు వార్డు మెంబర్ల వరకూ బీసీలను బ్యాక్‌బోన్‌గా భావించి పట్టం కట్టారని చెప్పారు. ఏం చేశారని చంద్రబాబును బీసీల పక్షపాతి అనుకోవాలని ప్రశ్నించారు. 2014–19 మధ్య బీసీలకు ఒక్క రాజ్యసభ స్థానమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్‌ అమలు సాధ్యం కాదని తెలిసినా వారిని మోసం చేసేందుకు మరోసారి కపట ప్రేమ చూపిస్తున్నారని చంద్రబాబుపై నాగమణి ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement