ఆ ఆరు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆ ఆరు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలి

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): నగర పాలక సంస్థలో విలీనం చేయడం సాధ్యం కాకపోతే కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని తూరంగి, ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట, చీడిగ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ తక్షణమే ఇవ్వాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం విలీన ప్రతిపాదిత గ్రామస్తులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్డినెన్స్‌ ద్వారా పంచాయతీరాజ్‌ నుంచి వేరు చేసినందున ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాన్ని ఆ శాఖ ఎప్పుడో కోల్పోయిందని అన్నారు. 2016లో విలీన గ్రామాల రికార్డులు తెచ్చినట్టే తెచ్చి ఇచ్చేసి పెద్ద తప్పు చేశారని, ఇప్పుడు పూర్వ భౌగోళిక ప్రదేశానికి విలీనం లేకుండా మరింత తప్పు చేస్తున్నారని చెప్పారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పట్టించుకోకపోవడంతో ఆ శాఖ తుది నివేదిక ఇన్నాళ్లూ ఇవ్వలేదని, దీంతో, అడ్వొకేట్‌ జనరల్‌ నివేదిక హైకోర్టుకు వెళ్లలేదని తెలిపారు. దీనివలన పుర పరిపాలన డైరెక్టరేట్‌ పంచాయతీ ఆస్తులు, అప్పులు, సిబ్బందిని స్వాధీనం చేసుకుని, కార్పొరేషన్‌ పాలనలోకి తెచ్చే ప్రక్రియ పూర్తి చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వ శాఖలు హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న విషయం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు తెలియలేదా అని సూటిగా ఆయన ప్రశ్నించారు. ఆరు గ్రామాల పౌరులకు 15 ఏళ్ల నుంచి స్థానిక ప్రజా ప్రభుత్వ పాలన లేకుండా చేసి, గ్రామ స్వరాజ్యానికి సంకెళ్లు కొనసాగిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్‌ 20న కలెక్టరేట్‌ వద్ద 48 గంటల నిరాహార దీక్ష చేపట్టినప్పుడు డిప్యూటీ సీఎం స్పందించి, కలెక్టర్‌ ద్వారా నివేదిక పంపి, హామీ ఇచ్చి, దీక్ష విరమింపజేశారని గుర్తు చేశారు. నాడు ఇచ్చిన హామీ ప్రకారం ఆయా గ్రామాలకు ఎన్నికలు జరిపించే బాధ్యత పవన్‌ కల్యాణ్‌పై ఉందని స్పష్టం చేశారు. లేకుంటే గాంధేయ మార్గంలో తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నిరసనకు సీనియర్‌ నాయకులు చింతపల్లి అజయ్‌ కుమార్‌, పెద్దింశెట్టి రామకృష్ణారెడ్డి, జుత్తుక శ్రీనివాసరావు, వాసంశెట్టి విజయ్‌ కుమార్‌, అంబటి రామకృష్ణ, త్రినాథరావు మహేష్‌, సతీష్‌ కుమార్‌ మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement