సృజనకు దోహదం కౌశల్‌–2026 | - | Sakshi
Sakshi News home page

సృజనకు దోహదం కౌశల్‌–2026

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

బాలాజీ చెరువు: విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభ, ఆలోచనా శక్తి, పరిశీలనా దృష్టి, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణల సామర్‌ాధ్యలను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న కౌశల్‌–2026 ప్రతిభాన్వేషణ పోటీల వాల్‌ పోస్టర్లను జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్‌ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు ఇవ్వనున్నామని, 8, 9, 10వ తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని తెలిపారు. క్విజ్‌, పోస్టర్‌ ప్రజెంటేషన్‌, రీల్స్‌ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

11 నుంచి శరన్నవరాత్రి

ఉత్సవాలు

20న శమీ పూజ, గ్రామోత్సవం

సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్‌ తెలిపారు. బుధవారం ఆలయ ఆవరణలో శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించి విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. నిత్యం ప్రత్యేక పూజలు జరుగుతాయని, పూజలల్లో పాల్గొనే భక్తులు రూ.500 దేవస్థానానికి చెల్లించి రసీదు పొందాలన్నారు. పూజా సామాగ్రిని భక్తులే తెచ్చుకోవాలని తెలిపారు. అమ్మవారికి 11న బాలా త్రిపుర సుందరిగా, 12న అన్నపూర్ణగా, 13న గాయత్రిదేవిగా, 14న లలితా దేవిగా, 15న విజయదుర్గగా, 16న మహాలక్ష్మిగా, 17న సరస్వతిగా, 18న మహిషాసురమర్ధినిగా, 19న రాజరాజేశ్వరిగా, 20న వెండి చీరలో అలంకరణ ఉంటాయని వివరించారు.

పారా స్విమ్మింగ్‌లో

నాగేశ్వరరావు ప్రతిభ

కాకినాడ లీగల్‌: రాష్ట్ర 8వ పారా స్విమింగ్‌ చాంపియన్‌న్‌షిప్‌–2026లో నగరానికి చెందిన లంక నాగేశ్వరరావు ప్రతిభ కనబరిచి స్వర్ణ, రజత పతకాలను సాధించారు. విజయవాడలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్విమ్మింగ్‌ పూల్‌, సిర్విజ్జీ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈ నెల ఐదున నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ అథారిటీ సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. నగరపాలక సంస్థలోని 30వ వార్డు సచివాలయంలో అడ్మిన్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు వంద మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌, వంద మీటర్ల బటర్‌ఫ్లై, వంద మీటర్ల ఫ్రీస్టైల్‌ విభాగాల్లో ఈ పతకాలు సాధించారు. వచ్చే నెలలో భోపాల్‌లో జరిగే జాతీయ పోటీల్లో సత్తా చాటాలని కమిషనర్‌ సత్యనారాయణ ఆకాంక్షించారు.

108, 104లో ఉద్యోగాలకు

దరఖాస్తుల ఆహ్వానం

పెద్దాపురం: 108, 104 అత్యవసర వైద్య సేవల్లో ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా అధికారి సుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భవ్య హెల్త్‌ సర్వీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ద్వారా ఈ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. డ్రైవర్లు, ఫ్లీట్‌ మెకానిక్‌లు, జిల్లా ఫ్లీట్‌ మేనేజర్ల పోస్టులు కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్టు తెలిపారు. డ్రైవరు పోస్టు కోసం పదో తరగతి విద్యార్హతతో పాటు చెల్లుబాటు అయ్యే హెవీ డ్రైనింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఫ్లీట్‌ మెకానిక్‌ పోస్టులకు ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌ అర్హత కల్గి ఉండాలన్నారు. జిల్లా ఫ్లీట్‌ మేనేజర్‌ పోస్టులకు బీటెక్‌ మెకానికల్‌ విద్యార్హత అవసరం అన్నారు. ఈ నెల పదో తేదీలోగా దరఖాస్తు చేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చునన్నారు. మరిన్ని వివరాలకు 89776 10335ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement